న కాశీ సదృశీ పురీ....

 


కాశీ సదృశీ పురీ....

కాశీ-గంగ అన్న రెండు పదాలు చిన్నతనం నుంచీ వింటూ పెరిగిన అదృష్టవంతురాలిని. అప్పట్లో తీర్థయాత్రల కన్నా ఇంట్లో పెద్దల నిర్యాణం తర్వాత అస్థికలు కలిపే కార్యక్రమంగా వెళ్లేవారు.

అహం కాశీం గమిష్యామి 

తత్రైవ నివసామ్యహం

ఇతి బ్రూవాణ స్సతతం

కాశీవాస ఫలం లభేత్

( కాశీ ఖండం)

పుణ్యక్షేత్రాలకైనా సరే వెళ్ళాలంటే అక్కడ కొలువై ఉన్న పరాత్పరుడిని, "అయ్యా! అనుగ్రహించు. నీ క్షేత్ర దర్శనానికి అవరోధంగా ఉన్న అడ్డంకుల్ని తొలగించుఅని ప్రాధేయపడాలి

కాశీ గొప్పతనం ఏమంటే కాశీకి వెళ్ళాలని ఉంది అనుకుంటే చాలుట వెళ్ళిన పుణ్యం మన ఖాతాలో పడుతుంది అంటారు.

శివపురాణం , శివానందలహరి ప్రవచన పారాయణలు, కుటుంబ సభ్యుల, బంధువుల మరియు స్నేహితుల యాత్రా విశేషాలు వింటూ ఎప్పుడు ఎప్పుడు జ్యోతిర్లింగాన్ని దర్శించగలనా అన్న ఆర్తితో కూడిన ఆవేదన. కాశీలో విశ్వేశ్వరుని లింగం మాత్రమే జ్యోతిర్లింగం కాదు. ఐదు క్రోసుల కాశి క్షేత్రం అంతా జ్ఞాన ప్రకాశంతో కూడిన జ్యోతిర్లింగం అంటూ కాశీ పంచకం లో శంకరాచార్యుల వారి ఉవాచ.

కాశి క్షేత్ర మహత్యాన్ని స్కాంద పురాణాంతర్గతమైన కథా భాగాన్ని కవి సార్వభౌమ శ్రీనాధులు  కాశీఖండంగా రచించి ఆవిష్కరించారు.

ఈరోజుల్లో ఎంతోమందికి నిత్య పారాయణ గ్రంథమైన గురు చరిత్రలో కాశీ వర్ణన కాశీ వైశిష్ట్యాన్ని విశదీకరిస్తుంది.

మన కర్మపాశాలను, ప్రారబ్దాలను తొలగించుకోవడంలో కాశి క్షేత్ర దర్శనం అత్యంత ప్రాధాన్యమైనదని అవగతం అవుతుంది.

అటువంటి కాశీ క్షేత్రంలో అడుగుపెట్టేసరికి అర్ధరాత్రి అయ్యింది. ఎన్నో ఏళ్ళ ఎదురుచూపులతో, ఎంతో భక్తి ఉత్కంఠలతో పాదం మోపి, మాకు కేటాయించిన వసతిలో సామాన్లు పెట్టగానే, మా వారు పద అలా గుడి దాకా వెళ్ళొద్దాం అన్నారు. గయ నుండి 10 గంటల పైన బస్సులో కూర్చుని వచ్చిన అలసటే లేదు. అర్ధరాత్రి ఒంటిగంట కావస్తున్నా మోడీ-యోగి జంట పుణ్యమా అని ఎన్నో సూర్యుల కాంతిలా విద్యుత్ దీపాల వెలుగు జిలుగులతో కైలాసమే  కాశీ గా దిగి వచ్చిందా అన్న భ్రమకు లోను చేసింది.

విశాలమైన రహదారులు మాకోసమే వేశారా అన్నట్లు, మా రాక కోసం ఎదురుచూస్తున్నారా అన్నట్లు అక్కడక్కడ గుంపులుగా రక్షక భటులు. మరునాడు ధన్ తేరస్ అదే ధన త్రయోదశి. కాశీ క్షేత్రంలో ఏడాదిలో నాటికి ఎంతో ప్రత్యేకత. మర్నాటి మధ్యాహ్నం ఒంటి గంటకి అమ్మ అన్నపూర్ణమ్మ దర్శనానికై వరుసగట్టి రోడ్డుమీద ఆదమరిచి నిద్రపోతున్న నిష్కల్మషమైన భక్తాగ్రేసరులు. అలా సాక్షి గణపతి సాక్షిగా గుడి ప్రాంగణం దాకా నాలుగు రోడ్లు చుట్టి బెనారస్ తేనీరు తీర్థం పుచ్చుకొని వచ్చాం.

వారణాసీ పురపతిం భజ విశ్వనాథం

శివయ్యకు సహస్రాధిక నామాలు. బాలుడు మార్కండేయునికి అభయమిచ్చిన మార్కండేశ్వరునిగా మొదటి నుంచి మా మదిలోనే కొలువయ్యాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో వేరువేరు నామాలతో దర్శించే ముందు అనుబంధం ఉండాలిగా!

అదిగో మా రాజమహేంద్రి మార్కండేశ్వర స్వామి వారి గుడిలో అయ్యవారు,  పార్వతిగా అమ్మవారు గోడమీద ఫ్రేమ్ కట్టిన అన్నపూర్ణాష్టకం!

అబ్బా ఇప్పుడు ఇలా తలుచుకుంటూంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి వారిని దర్శించుకోవాలా అన్నంత తహతహగా ఉంది.

(మా పార్వతీదేవి అనుగ్రహం వలన నెల మార్చి ఒకటిన అనుకోకుండా వెళ్ళి దర్శించుకోగలిగాము)

దేవాలయాల గోడలమీద స్తోత్రాలు, ద్వారాల మీద శ్లోకాలు మన దైవ ధ్యానానికి చిన్నతనంలో పునాదిగా దోహదపడతాయి

విశ్వనాథుని స్పర్శించడమే

కాశీలో కాలు పెట్టిన రెండు గంటల్లోనే కంటికి కునుకు కంటే విశ్వనాధుని వీక్షించడం ఎంత అదృష్టం!

ప్రయాగ నుండి వెంట తెచ్చుకున్న సంగమ గంగ, అభిషేక ద్రవ్యాలు, గుడి ప్రాంగణంలో లభ్యమైన బిల్వ పత్రాలతో కూడిన గోక్షీరం తీసుకుని స్మరణలో ఉన్న స్తోత్ర పఠనాలతో కార్తీక మాస బ్రాహ్మీ ముహూర్తంలో,....

ముందుగా గర్భాలయంలో గోడల మీద బంగారు తాపడం చేసిన రామచంద్రుడు శివాయ విష్ణు రూపాయ అన్నట్లు ఆహ్లాదపరిచాడు.

సామీప్యం-సాయుజ్యం

బారులు తీరిన వరుసలు, గంటల కొద్దీ నిరీక్షణ, చివరిగా జరగండి, పదండి అనే అదిలింపుల కొరడాలు. అయినా ఒక్కరూ వెనక్కి తగ్గరు. కిక్కిరిసినా, ఊపిరి తీసుకోవడం కష్టమైనా సామీప్యమే సాయుజ్యం అన్న తహతహలతో ఆయనకై తెచ్చిన అభిషేక ద్రవ్యాలతో హర హర మహాదేవ శంభో శంకరా అంటూ ఆరాధించి స్పృశించాను. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు శివానందలహరి విశదీకరిస్తూ ఎన్నోసార్లు వివశతకు లోనుచేసిన శ్లోక భావాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి.

తత్పాదాంబుజ మర్చయామి పరమం

త్వాం చింతయామ్యన్వహం ...

ఇంకేముంది? ఇంకేం కావాలి?

నరత్వం సిద్ధి పొందింది. చేతుల నుండి శరీరం అంతా ప్రాకిన విద్యుత్తు తలచుకుంటే అనుభవం మూగదవుతోంది. ఇంక చాలు అన్న తృప్తి.

ఇంతటి అద్భుతమైన సాక్షాత్కారం ఇవ్వటానికే స్వామి నన్ను నిరీక్షింప చేశాడు. విశ్వనాథుని కి అభిషేకాలు సప్తర్షి, శయన హారతులు- పవళింపుకు ముందు యువ భక్త బృంద నృత్య భజనలు, మా మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.

అన్నపూర్ణా సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

బంగారు అన్నపూర్ణ. అమ్మ ఎప్పుడూ బంగారమే. కాశీలో ఉన్న పది పగళ్ల 11 రాత్రులలో అమ్మని ఎన్నోసార్లు దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించింది. అభిషేక సమయంలో నిజరూప దర్శనం, స్పృశించే అవకాశం, చీని చీనాంబరాలు ధరించే తరుణంలో మనం భక్తితో సమర్పించుకున్న నూలి పోగులాంటి చీర అమ్మ భుజాలపై అలంకరించటం. యంత్రేశ్వరుడిగా ప్రాంగణంలో శ్రీ భాస్కరాచార్యులు వారిచే ప్రతిష్టించబడిన శివలింగం, దానిపై శ్రీ చక్రం. అక్కడ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, సహస్రనామ స్తోత్రం లిఖించుకుంటూ ఆరాధించగలగడం కేవలం ఆమె కృపా భిక్ష . తల్లికి బిడ్డ మీద ఉన్న వాత్సల్యానికి నిదర్శనం. బంగారు అన్నపూర్ణగా మిద్దె మీద అమ్మ దర్శనం హృదయంలోనూ, అమ్మ ఖజానా నుండి దక్కిన నాణేలను అపురూపంగాను మా వద్ద భద్రపరుచుకున్నాం. అమ్మ ప్రసాదాన్ని స్వీకరించాం మనల్ని వదిలి వెళ్ళిపోయిన పెద్దల పేర్ల మీద అన్నదానానికై ట్రస్ట్ కి సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకున్నాం.

వారణాస్యాం విశాలాక్షీ

అంటూ నిత్యం సాయం వేళ తలుచుకునే అష్టాదశ శక్తి పీఠాలలోని అమ్మవారు. సతీ దేవి చెవి రింగు పడిందని, కన్ను అని, ముఖం, గొంతు ఇలా వేరు వేరు వాదాలు వినపడ్డా తీరువుగా ఉన్న అమ్మ మూర్తి ఎంత చూసినా తనివి తీరదే! అది శంకరాచార్యుల వారు ప్రతిష్టించినదని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాన్ని నేరుగా చూడటం మానవ మాత్రులకు సాధ్యపడదనీ తెలిసింది. తల్లి చాటు పిల్లలా జగజ్జనని అయిన విశాలాక్షి ప్రతిష్టించిన మూర్తి వెనుక కొలువై ఉంది. పక్కనుండి దర్శించు కుంటే కానీ మనకు కనపడదు. కళ్ళు మనసు సంతృప్తితో సేదతీరాయి. అమ్మ ఎదురుగా మన తలపైన డోమ్ మీద రాశిచక్రాల రాతి ఫలకం ఆశ్చర్యం గొలిపేలా ఉంది. శ్రీ నండూరి శ్రీనివాస్ గారి పుణ్యమా అని దేవీ ఖడ్గమాలతో అమ్మని స్తుతించుకున్నాం.

గంగా జలలవ కణికా పీతా

కాశీ-గంగా కవలల వంటివి. జంటగా స్ఫురించే అత్యంత పవిత్ర నామాలు. గోదారమ్మను నిత్యం చూస్తూ, ఎక్కువగా మునకలు వేస్తూ పెరిగామేమో నదులు అంటే వల్ల మాలిన ఆరాధనఅపేక్ష. దక్షిణ గంగ అనీభారతావనిలో రెండవ అతి పొడవైన పెద్ద నది మా గోదావరి అనీ వింటూ ఎదిగాం. మొదటి స్థానంలో ఉన్న గంగని ఎప్పుడు చూడగలనానెత్తిపై చల్లుకుని, పూజించుకునిపవిత్ర స్నానం ఆచరించగలనా అన్న ఆశ నెరవేరింది.

ఇక మన గురువర్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణంలో అంతర్భాగంగా చెప్పిన గంగావతరణం శ్రోతల్ని త్రిపధగా విస్తృతికెక్కిన జాహ్నవి ఝరిలో మానసిక స్నానం చేయించి తీరుతుంది" గంగా జలలవ కణికా పీతా" అని నిత్యం మన స్వర సరస్వతి శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్రంతో చెవుల్లో గంటలు ఎన్నిసార్లు మారుమ్రోగాయో!

ఇలా ఎన్నని చెప్పను?

గంగ అన్న పదాన్ని నీరుకి ప్రత్యామ్నాయంగా వాడతారు. కాస్త గంగ పుచ్చుకోండి అని అతిథి మర్యాదలు చేస్తాం. దాహంగా ఉన్నాలేకపోయినా నడకే ప్రయాణ సాధనమైన రోజుల్లో దాహార్తితో అలమటించకుండా చక్కటి ఆచారం మర్యాద.

మన ఇంటి ట్యాంక్ నీళ్లతో స్నానం చేసినా గంగేచ యమునే చైవా గోదావరి సరస్వతి... అంటూ గంగతో ఆరంభించి అన్ని నదుల పవిత్రతను నీటిలోనికి ఆహ్వానిస్తాం.

ఇంక దివి నుంచి భువికి వచ్చిన సురగంగలో స్నానం మన శరీరాన్నే కాక అంతఃకరణాలను కూడా ప్రక్షాళన చేసినటువంటి పవిత్రమైన అనుభూతి. భాగీరథి నీటి స్వచ్ఛత మా ఆనందాన్ని ఎన్నో రెట్లు ఇనుమడింప చేసింది. సాయం సంధ్యలో నావపైన మొదలుపెట్టిన మా నదీ విహారం అన్ని ఘాట్లను వెలుగులోనూదీపాలలోనూ చూసుకుంటూనది నుండి ఒడ్డున జరిగే గంగాహారతిని చూడటం ఒక మరుపురాని మధుర స్మృతి. అదే హారతిని మెట్ల పైనుండి దగ్గరగా వీక్షించుకోవడం మరో అనుభూతి.

అన్నిచోట్లా అదే గంగ అని కొంతమంది అనుకున్నా దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక, కేదార్, పంచగంగా, అస్సీ ఘాట్లలో చేసిన పవిత్ర స్నానాలు దేనికదే ప్రత్యేకంగా నిలిచాయి.

అడుగడుగునా దేవాలయాల సమాహారమైన వారణాసి క్షేత్రంలో సందర్శించుకోవాల్సిన ముఖ్య ఆలయాలను, ప్రదేశాలను

విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం

వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం

అన్న శ్లోకంలో కాశీఖండంలో పొందుపరిచారు.

వీటితోపాటు మహా మృత్యుంజయ మందిరం, ధన్వంతరి కూప జల సేవనం , ద్వాదశ  ఆదిత్యులు, గవ్వలమ్మ, దుర్గమ్మతులసీ మానస మందిరం, సంకటమోచన, వారాహిమాత, తిలభాండేశ్వర్, భరతమాత మందిరం, నీలకంఠేశ్వరాలయం, అగోడా బాబా కినారా ఆశ్రమం, బెనారస్ యూనివర్సిటీలో విశ్వనాథ మందిరం, ధర్మేశ్వర లింగం, ఆది అన్నపూర్ణ, వట సావిత్రి, బటుక్ భైరవ, ఆది భైరవ, కామాఖ్య, గృశ్నేశ్వర లింగం, శ్రీ చక్ర దేవాలయం, బృహస్పతి ఆలయం. కాశీలో నివసించిన పది రోజులూ మమ్మల్ని ఆశీర్వదించి దేవతలు.

గాయత్ర్యా సమో మంత్రం

కాశీ సదృసీ పురీ

విశ్వేశ సమం లింగం

సత్యం సత్యం పునః పునః

(కాశీ ఖండం)

ధన్యోస్మి 

చన్నాప్రగడ (గంధం)జయలక్ష్మి చంద్రశేఖర్

బెంగళూరు

🙏🙏🙏🙏🙏

( ఎన్నో సంవత్సరాల నిరీక్షణ విశ్వేశ్వరుని అనుగ్రహంతో కార్తీక ఘడియల్లో నెరవేరిన కల, మా కాశీ యాత్ర. నవంబర్ 9 నుండి 19 వరకు కొవ్వూరు హరేకృష్ణ  ఆధ్యాత్మిక యాత్ర, శివానంద దాస్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో సాగిన కాశీపుర వాస విశేషాలు)



శ్రీ సామ్రాజ్యేశ్వర్ పశుపతినాథ్ మహాదేవ్ మందిర్ - లలిత ఘాట్


విమలాదిత్య దేవాలయం


గంగ హారతి - దశ అశ్వమేధ ఘాట్










Comments

  1. Wow.. Thanks for sharing your Great experience.The explanation is too good for a moment felt like I too travelled with u 😊.This making us to go and visit this holy place ASAP😍.Om namah shivaya 🙏

    ReplyDelete
  2. కాశీ క్షేత్రంలో తనివి తీరా మనసు తీరా గడిపిన మధుర క్షణాలను ఆ పవిత్ర స్థలిలో ఎలా తిరగాడి చూడాలో వివరించిన విధం అద్భుతంగా వుంది. పెద్దల ఆశీస్సులు, చదివిన చదువుకు సార్థకత చేకూరేలా సాగిన కథనం అలరించింది. మీతోనే కాశీ యాత్ర చేయాలని మళ్ళీ సంకల్పించింది విపులంగా క్షేత్ర మహాత్మ్యం కనుల ముందే సాక్షాత్కరించింది. కాశీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి కృపా కటాక్ష ప్రాప్తిరస్తు

    ReplyDelete
  3. I personally enjoyed the narration as it made me feel that I travelled along with you. As always written it so clearly that everyone who hasn't gone feel to visit and take the blessings of Kashi Vishwanath & Vishalakshi amma along with River Ganga dip. Har Har Mahadeva, Shambo Shiva. Mahashivratri Subhakanshallu 💐🙏

    ReplyDelete
  4. మీ కలమే , భగవానుడు సంజయునికీ ఇచ్చిన దివ్య చక్షువులులా అయి భక్తి పారవశ్యంపు ఆనందబాష్పపు గంగాధారలై "విశాల"కాశీ "విశ్వ" దర్శనం "అన్న, పూర్ణ"త్వాన్ని, కల్పించింది 🙏🏻🙏🏻

    ReplyDelete

Post a Comment

Popular Posts