ఉగాది 'విజయం'


You can Listen to this Kavitha in the above Audio. 

ఉగాది 'విజయం'



ఉగాది కోయిల పాడుతూ యిలా

ఊగుతోంది మావి ఊయల, మదిలోగిల

 ఏవీ ఆ 

స్వచ్ఛమైన చిరునవ్వుల పలకరింపులు

నిర్మలమైన కన్నీళ్ళ  చిలకరింపులు

ఆప్యాయతల ఆదరాలను అదుగో

ఆ మెగా సీరియల్స్ రాబందులు మింగేస్తున్నాయి.


ఏమా మాయ 

మీట నొక్కితే చాలు

ప్రపంచంలోని ఏ వింతైన కళ్ళెదుట

ఇంద్రజాల మహేంద్రజాలాలను

అపహాస్యం చేస్తూ ఈ అంతర్జాలం 

పిల్లల పసితనాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తోంది

మొగ్గల్ని వికసించకుండా విడదీస్తోంది 

అపురూపమైన మధుర జ్ఞాపకాలను బట్టబయలు చేస్తోంది


 ఎంత విడ్డూరం 

"ఇంకా ఖర్చుపెట్టండి 

మేము మరిన్ని బహుమతులిస్తాం",

అని బ్యాంకులు,

"మాట్లాడుతూనే జీవించండి - జీవిత కాలానికి  వేలిడిటీ", అంటూ 

మాటకు విలువ లేకుండా మనసును మూగ చేస్తూ 

ప్రత్యక్ష సంబంధాలను తెంచేస్తున్న కనెక్షన్స్ 


అందుబాటులో విదేశీయానం

అనుబంధాలు మాత్రం అందనంతం దూరం 

కబుర్లే కరువైన కుటుంబ సభ్యులందరికీ 

తలకొక ఫోను మాధ్యమం


 అయితేనేం, 

 మర్రి విత్తులో దాగిన వటవృక్షపు గమ్మత్తులా

బ్రహ్మాండాలనూ పుక్కిలిపట్టిన వటపత్ర సాయి మహత్తులా

నిదురలో నవ్వే నిష్కల్మషమైన చిన్నారి

నన్ను ఆహ్లాదపరుస్తోంది

 ఆధ్యాత్మిక పరిమళాల చిరునామా

మన భారతావని అని జాగృత పరుస్తోంది.


అదుగో

వర్షించిన నిరాశా మేఘాలు

హృదయాల్ని తేలికపరుస్తూ

 ఇంద్రధనస్సు ఆశల హరివిల్లై పొడుస్తోంది.


మేఘశ్యాముని మురళీరవం - ప్రశాంత ఉదయమై

వివేకానందుని శంఖారావం - ప్రచండ ఉత్తేజమై

పరమశివుని ఢమరునాదం - ప్రదోష ఉద్వేగమై

తధాగతుని బోధలు - అజ్ఞానపు చీకట్లను చీలుస్తూ....

తేజోవంతమైన కాంతిపుంజంమై.... సత్యమై 

నా మది కోయిలకు ఉత్సాహమై

నందనాన్ని విజయపథంపై నడిపే

ఈ ఉగాదిని ఆహ్వానిస్తోంది.


పగలూ రేయీ కలిస్తేనే ఒక రోజు - అది ప్రత్యక్ష ప్రామాణికం.

 సుఖదుఃఖాలతో భ్రమించేదే జీవిత చక్రం - ఇది దైనందిన అనుభవం.

తీపి చేదు తో కూడిన ఉగాదే అందుకు నిదర్శనం.


( ప్రియమైన అన్నయ్యకు ఆర్తితో) 

చన్నా ప్రగడ (గంధం) జయలక్ష్మీచంద్రశేఖర్


UGADI Series Part - 1

Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 11th April 2013

Comments

Popular Posts