గురు పూర్ణిమ
You can Listen to this Kavitha in the above Audio
గురు పూర్ణిమ
గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః I
గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః II
చిన్నతనంలోనే మనం నిత్య ప్రార్థన శ్లోకాల్లో గురువుకి పెద్దపీట వేసాం.
త్రిమూర్తులు ముగ్గురనీ పురాణాల్లో కథలుగా తెలుసుకునే ముందే గురువే బ్రహ్మ విష్ణువు ఆయనే మహేశ్వరుడు అని నేర్చుకున్నాం.
ఆత్మజ్ఞానానికి ఆయు పట్టు అయినా ఆ పరబ్రహ్మ ఎవరో కాదు సాక్షాత్తు గురువే అని మనకు ఉగ్గుపాలతో రక్తంలో కలిపేశారు.
మనం దేవుళ్ళుగా ఆరాధించే ఆ రాముడు కృష్ణుడు కూడా గురువు ఉండి తిరాలని మనకి సాంప్రదాయం చేశారు.
గురు అంటే మొదట్లో అన్ని విషయాలు చెప్పే అమ్మానాన్న అనిపించేది.
అమ్మ మొదటి గురువుగా ప్రేమతో నేర్పిన సంస్కారం నాన్న క్రమశిక్షణతో ధర్మాన్ని ఆచరించేలా చేస్తుంది.
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ.
ఇలా అమ్మానాన్నలతో పాటు ఆచార్యుడినీ మనం మూర్తిభవించిన దేవునిగా నిర్దేశించుకున్నాం.
తర్వాత స్కూల్లో టీచర్ ఇంకా గొప్ప ఎన్ని విషయాలు తెలుసో కదా!
గురువు అనే పదానికి అజ్ఞానాన్ని పారద్రోలేవాడుఅనే నిర్వచనానికి అన్ని విధాలా సరిపోతారు టీచర్లు.
వేదాలను విభజించిన వేదవ్యాసుల వారు మనకి పెద్ద మాస్టారు. అందుకే రిఫరెన్స్ గ్రంథాలు అనే వేదాలను రీసెర్చ్ స్కాలర్స్ కు ఇచ్చి ఊరుకోకుండా ప్రాథమిక పాఠశాలలోని పిల్లలకు చెప్పినట్లు తేలిగ్గా కధలుగా మనకి అరటిపండు వలిచి పురాణాలుగా అందించారు.
ఆచరించి చూపేవారే ఆచార్యులుఅంటూ మన సామవేదం షణ్ముఖ శర్మ గారు శెలవిచ్చినట్లు భారతీయ సంస్కృతికి ఆచార విచారాలు రెండు కళ్ళ వంటివి.
ధర్మాన్ని ఆచరించి కాపాడుకోవాలి. జ్ఞానాన్ని విచారించి ధ్రువీకరించుకోవాలి.
ఆదిశంకరలు నుండి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దాకా చిమ్మ చీకట్లో కూర్చుని భయపడుతున్న మన వేలును పట్టుకుని జ్ఞాన కాంతి దిశగా నడిపించడానికి అశేష గురువులు బారులు తీరి ఉన్నారు.
ఎవరైనా మన తల మీద చెయ్యిపెట్టి క్షణంలో బుర్రలోని అజ్ఞానాన్ని బుల్లెట్ తో పేల్చి జ్ఞాన బల్బుకు స్విచ్ వేసేయొచ్చు.
కేనో ఉపనిషత్తులో చదివిన జ్ఞాపకం గురువంటే జ్ఞాన జ్వాల లాంటివాడు అని. తన దరి చేరిన శిష్యుడిని తనంతటగా చేసేస్తాడు అని. ఒక దీపంతో ఎన్ని దీపాలనైనా వెలిగించగలం. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అయితే గురువు అనే జ్ఞాన దీపానికి సమీపంగా, సన్నద్ధతతో ఉంటేనే అది సాధ్యం.
చదవటం అంటే గుర్తుకొచ్చింది పుస్తకాన్ని మించిన గురువే లేదనిపిస్తుంది. అమ్మ నాన్న టీచర్లు చెప్పనివి కూడా సిలబస్ తో పని లేకుండా ఇవి ఎన్నో చెప్పేస్తాయి.
నిజం చెప్పాలంటే ఒక జీవితకాలంలో ఒక గురువు నుంచి ఒక్కోటి నేర్చుకునే విషయాల కన్నా ఒక్క గ్రంథం ఒక్కసారిగా ఎన్నో విషయాలను విపులంగా విశదీకరిస్తుంది. భగవద్గీత ప్రపంచమంతా ఒప్పుకున్న వ్యక్తిత్వ వికాస గ్రంధం కదా.
పుస్తకాలు ఫ్రెండ్స్ లాగా నవ్విస్తాయి కవ్విస్తాయి ఏడిపిస్తాయి కూడా.
ఫ్రెండ్స్ అంటే తప్పనిసరిగా చెప్పి తీరాలి. స్నేహితులు ఒక టైం లో అమ్మానాన్న, తోబుట్టువులు అందరికన్నా ఎక్కువ అయిపోతారు. అందుకే తాము చెప్తే వినని పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితులతో మాట్లాడిస్తారు. నీ స్నేహితులు ఎవరో చెప్పు! నువ్వు ఎలాంటి వాడివో చెప్తాను అన్న నానుడి కూడా ఇందువలనే. ఒకరినొకరు ఈ రోజుల్లో ఏం గురూ అని పిలుచుకుంటూ వుంటారు గా ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?
గురువు అనగానే గురు చరిత్ర పారాయణం కలిగించే ఆనందం గుర్తుకొస్తుంది. సంసార తిరణాల్లో తప్పిపోయిన మనకోసం వెతుక్కుంటూ మన గురువు వడివడిగా వస్తున్నట్లే మనసులో హడావిడిగా ఉంటుంది. సినిమాలు చూపించినట్లు పక్కనే ఉన్న చివరిదాకా దొరక్కుండా అజ్ఞానానందంలో తిరిగే సిసింద్రీలం మనం.
దత్తాత్రేయులు తనకు గురువులు 24 గురు అని చెప్పారు. క్రిమి కీటకాల నుండి ప్రకృతిలోనే ప్రతి జీవి నుండి పాఠాలు నేర్చుకున్నారని కదా అంటే మనలో ముందుగానే ఉన్న జ్ఞానాన్ని అన్వయించుకోవటానికి అవీ ఇవీ అని లేదు అన్నీ సహాయపడతాయన్నమాట.
సమయం వచ్చినప్పుడు లేదా మన ప్రయత్నం వల్ల ప్రకృతి కలిసి రావటం లాంటిది అన్నమాట. ప్రకృతి నుండి మనం ఎన్నో పాఠాలు నిత్య సత్యాలుగా నేర్చుకుంటూనే ఉన్నాం పంచభూతాలనుండి మహత్తనండి మరొకటినండి మాటలు కన్నా మౌనభాష గొప్పదనాన్ని చాటి చెప్పేది కేవలం ప్రకృతి మాత్రమే.
ఒక్కొక్క ప్రశాంతత ఉదయం పక్షుల కిలకిలా రావాలు వీనులకు చల్లటి చిరుగాలులు మేని తాకుతూ ఉంటే నిజంగానే మీలోనే మీరు ఉంటూ మిమ్మల్ని అన్నీ మరిచిపోయి సేదతీర్చిన క్షణాలు ఎన్ని లేవు?
గురువులంటారు వర్తమానంలో ఉండు. సాక్షిగా ఉండు అని. ఒకప్పుడు వకీలైనా పాపానికి నాకు సాక్షిగా ఉండడం కుదిరే పని లాగా ఈ జన్మకి తోచటం లేదు. అందుకే వేగంగా పరిగెత్తే మనసును ధ్యాన సాధనాదులతో చేతకాక ఇలా అక్షర కళ్ళాలు వేస్తూంటాను.
సరైన ఆహారం సద్గ్రంధ పఠనం సత్సాంగత్యం మనల్ని మంచి మార్గాన నడిపి స్తాయి. పురోగతికి సోపాన సాధనాలు అని సోదాహరణాలుగా ఎన్నో విన్నాం కన్నాం.
అవును అనుభవాన్ని మించిన పాఠం లేదంటారు
గురువు.
లడ్డూని ఎంత వర్ణించినా తిన్న అనుభవం లేనిదే ఆ జ్ఞానానికి అర్థం లేదు అంటారు శ్రీ పరిపూర్ణానందుల వారు.
మనం పుస్తకాల నుండి గ్రహించిన జ్ఞానం అనుభవంలో పెట్టినప్పుడే కదా సత్యం అనుభవం లోనికి వస్తుంది! చదువుతోపాటు ప్రాక్టికల్స్ అని ఉద్యోగానికి ముందు ఇంటర్న్ షిప్ లనీ అంటే అవే కదా.
అంటే సత్యము అనుభవం
లో ఉంది.
అనుభవం మనకే సొంతమైనది.
అందుకే మనం పిల్లలకు మా అనుభవంతో చెప్తున్నా వినండీ అంటాం. తల్లి ఏమరుపాటులో ఉన్నప్పుడు మంటలో చేయిపెడతారు పిల్లలు. చేతులు కాలాకే కదా మంట నుండి జాగ్రత్త పడేది!
ఎరుక అనేది అనుభవంతోనే వస్తుంది. మన ఎరుక పరిధి ఎంత అనేది మన జ్ఞాన నిల్వలపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానం విస్తృతమైనది. విశ్వ
మంత విశాలమైనది. నీటి బిందువంత మన ఎరుకని ఆవిరైపోనీకుండా, ఎలాగైనా సముద్రానికి చేర్చేద్దాం. సముద్రంలో ఒకటిగా మారుద్దాం. మనమే సముద్రం అవుదాం. విశ్వం విష్ణురషట్కారో... అంటే సాయుజ్యం అన్నమాటేగా.
మనల్ని మనం మర్చిపోవడం అంటే మనసు ఊరుకుంటుందా? మాటలు వస్తున్న తరుణంలో అదే పనిగా అర్థం లేకుండా వసపిట్టలుగా మాట్లాడే మన పిల్ల పక్షులను పోలిందే మన మనసు. శబ్దాలు చేస్తూనే ఉంటుంది. పాపం దాని ఉద్వేగాలు దానివి. ప్రేమ అంటుంది ద్వేషం అంటుంది ఇష్టం అంటుంది కష్టమూ అంటుంది.
ఆ రణగొణ ధ్వనులనే మనం పరమశివుని ఢమరుక నాదం గా, ఓంకారం నుంచి వ్యాపించిన శబ్ద తరంగాలుతో చేకూరే ప్రశాంతతగా, రెండు శబ్దాల మధ్య దాగిన నిశ్శబ్దంగా , రెండు ఆలోచనల మధ్య ఉన్న విరామాన్ని వెలికి తీయగలిగేది కూడా అదే మనసు.
మనః ఏవ కారణం బంధమోక్షయోః అందుకే దాన్ని మనం పిల్లల్ని సాగినట్లే లాలనగా ప్రేమగా బుజ్జగించాలని వివేక చూడామణి సూటిగా నే చెప్పిందిగా!
పిల్లలంటే మళ్ళీ తరుముకుంటూ మరో గుర్తు పొడి చేస్తోంది. వాళ్ళు మన గురువులట. శిష్యుని వెతుక్కుంటూ గురు వచ్చినట్లే వచ్చినట్లే మనం ఈ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్పటానికి మనల్ని ఉద్ధరించడానికి వాళ్లు మనల్ని తల్లిదండ్రులుగా ఎన్నుకొని మరీ వస్తారట. మనం అమ్మా,నాన్న, టీచర్ల కంటే పిల్లల వల్లే ఎన్నో తెలుసుకుంటాంట. వాళ్ళ ఎదుగుదలతో పాటు నేర్చుకునేవి వాళ్ల వల్లే నేర్చుకునేవి ఎక్కువట. అబ్బెబ్బే స్మార్ట్ ఫోన్ లో ఫేస్బుక్, వాట్సాప్ లాంటి రకరకాల యాప్పుల విషయాలు గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది
మన అనుభవం వాళ్లకు ఉపయోగపడేది ఎలా ఉన్నా అజ్ఞానపు మమకారపు ముసుగు నుంచి వాళ్ళు మనల్ని వాస్తవ కాలానికి తీసుకు వస్తారు. ప్రేగుపాశాల నుండి నిత్య సత్యమైన జ్ఞాన ధారల వైపు మళ్ళిస్తారు. మన కళ్ళు తెరిపిస్తారు. వాళ్లకు మనం ఎంతో రుణపడి ఉంటాం
యజ్ఞవల్క్యమహర్షి తనభార్యలైన మైత్రేయి, గార్గిలకు భర్త గానే కాక గురువుగా బోధించారని మనం విన్నాం. ఈ కాలంలో ఎవరికా తీరిక? ఎవరు బోధించేవారో ఎవరు నేర్చుకునే వారో? ఇంకా వాదనలో తేలాలిగా !
అందుకే నిజమైన వైరాగ్యానికి సంసారం తప్పనిసరి అనిపిస్తుంది నాకు. అప్పుడే ఆనందం బయట లేదు - అది నీ స్వభావం అన్న రమణులు చాలా సమీపంలోనే ఉన్నట్లు తోస్తుంది.
ఆలోచనలను దుస్తులలా ఎన్నుకోమనే *శివానీ*తో సహజీవనం చేస్తున్నట్టుగానే ఉంటుంది.
నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్ పరధ్యాస మాని నీ శ్వాస మీద దృష్టి పెట్టు. తరించి పోతావ్ అనే పిరమిడ్ పత్రీజీ
వాళ్లు వీళ్లు ఏమిటి? రామకృష్ణుడు, శారదా మాత, వివేకానంద,
కుసుమహరనాధులు, చిన్నయానందులు, షిరిడి సాయిబాబా, పరమహంస యోగానందులు పుస్తకాలనుండి బయటకు వచ్చి కబుర్లు చెబుతూ ఉండడం ఆరంభం అవుతుంది.
అంతరాత్మను మించిన గురువు లేడు ఆత్మ కథకు ధీటైన గ్రంథం లేదు.
అందుకే ఆత్మానందంలో మునకలు వెయ్యి అన్నారు. అందరూ మౌనం విలువని గుర్తించమంటున్నారు. మాటలు అక్షరాల బందీలుట.
నిజమైన జ్ఞాని చాటుకోడు.
తను
గురువులమని చెప్పే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
నిరాడంబరులు, స్నేహశీలురు మన చుట్టూ ఉన్నారు. గురుత్వమన్నది నువ్వు ఎటు ఆకర్షింపబడితే అందులో ఉంటుంది. ఆకర్షణల విషయంలో వివేకం ఉండాలి.
వివేకం-విచక్షణ మనల్ని కాపలా కాస్తూ ఉండాలంటే మనకు భగవత్ అనుగ్రహం కావాలి.
అమ్మ కృప వర్షిస్తూనే ఉంటుంది. మనం అహంకారపుటెత్తుల్లో నివసించకుండా వినమ్రత పల్లాల్లోనే ఉంటే అది మనకే ఎక్కువ లభిస్తుంది.
ఆ స్థానంలోనే కదలకుండా నిన్ను ఉంచగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది గురువే. ఈ జన్మలో అటువంటి గురువు లభిస్తే ముక్తే. ఎదురుగా లేకపోయినా ఏకలవ్యుడిలా గురువును మించిన శిష్యుడిలా తయారవుతావ్.
ఇవాళ నువ్వు నిద్ర లేచావు అంతకన్నా అద్భుతం ఏం కావాలి నీకు అంటూ ఉత్సాహానికి మారుపేరైన జగ్గీ వాసుదేవ్ లాంటి గురువు నిత్యం ప్రత్యక్షంగా కావాలా.
గాఢ నిద్ర నుండి లేపటానికి? వాళ్ళ స్ఫూర్తి నీలో చైతన్య దీప్తి అయి చంద్రోదయం అయిన నాడే గురుపూర్ణిమ మహోత్సవం.


మరో మాట్లాడినట్లు రాసే మీ శైలి అమోఘం👌🙏
ReplyDeleteThank you Sailja😃
Delete