"ఎన్నిక"ల ఉగాది
You can Listen to this Kavitha in the above Audio.
“ఎన్నిక" ల ఉగాది
“ఎన్నిక" ల ఉగాది
ఎన్నో కలలకిది ఆది
'ఎన్నిక' తేలక సతమతమయ్యే హృది
అందరి ఓటు మంచికే
అయితే ఎవరి మంచి వారిదే
ప్రజాస్వామ్యం దేశానికేనా?
దేశమంటే మనుషులోయ్ అన్నారు కదా
ఒంగననే శరీరం
లొంగననే మానసం
ఇక ఆత్మ అంటారా
పైరెండూ జోకొడుతుంటే
మేలుకొలుపుకై ఎదురు చూసే చకోరం.
మరి మనం మనలో దేన్ని ఎన్నుకొంటున్నాం?
వేటిని ఎంపిక చేసుకోగలం?
పుట్టుకలో ఏదీ మన ఎంపిక కాదు
శరీర వాహనం దిగే లోపు మనం
మన ఎన్నికలను సజావుగా నిర్వహిద్దాం.
ఐదు సంవత్సరాల కొకసారి
వచ్చే ఎలక్షన్లకన్నా
గడచిన క్షణం తిరిగిరాదన్న
విచక్షణ తో వ్యవహరిద్దాం.
బట్టలేంటి బూట్లేంటి
ఈ బట్టబయలు “ విపణి" లో
భాగస్వామినైనా
అడుగడుగునా ఎంపికలకు అలవాటు పడ్డ
సామర్ధ్య శాలులం మనం
జీవన సాఫల్యతకై బాధ్యతతో,
బహుజాగ్రత్తగా అడుగు ముందుకు వేద్దాం.
రైతు మేలు రకాల విత్తనాలే నాటినట్లు
మన చైతన్యాన్ని ఉద్ధరించే శ్రేష్టమైన ఆలోచనలే చేద్దాం.
మెదడు భూమిని దున్నేద్దాం.
నిర్వేదం, ఆశాంతి లాంటి గులకరాళ్ళను ఏరేద్దాం.
ఇంతదూరమా మెదడు నుండి గుండెకు?
అన్ని బంధాలకూ, లాజిక్కులు వెతక్కుండా
హృదయంతో స్పందిద్దాం.
హృదయ సీమను ప్రేమ, దయ, కరుణ
అనే ఎరువులతో ఉల్లాస భరితం చేద్దాం.
అవగాహన అనే సానుకూల పవనాలకు,
సంసిద్ధతతో కూడిన సూర్యరశ్మికి
అవరోధం కలగకుండా చూసుకుందాం.
ఆనందం, శాంతి అనే జలాలతో
చేను దాహాన్ని తీరుద్దాం.
అమృత ఫలాలను అందుకునే ప్రయాణంలో
మనల్ని క్రిందకు లాగే విషతుల్యమైన
అసూయ, ద్వేషం, కోపం అనే
కలుపు మొక్కలను పీకి పారేద్దాం.
పథకాలనే ప్రచారం లేకుండా
నిరంతరం ఉచిత సరఫరాగా
గాలీ, నీరు ఇచ్చే ప్రకృతి మాత నుండి
నిస్వార్ధత నేర్చుకుందాం.
చరాచర జగత్తు అంతా వ్యాపించి
వ్యక్తమవుతున్నపరమాత్మ
ప్రతీ వ్యక్తిలోను శక్తి అవుతున్నాడు.
అందుకే మన “ ఎన్నిక " ల
కర్తవ్యం పూర్తి చేసి
అన్నీ ఆయన జోక్యంతోనే జరుగుతున్నాయనే
నిశ్చింతతో నిరీక్షిద్దాం.
మిగిలిన జీవితకాలానికి సరిపడా
సరికొత్త పంటలకు ఈ ఉగాదిని ఆరంభం చేద్దాం.
అష్టవక్రుడి లోని జ్ఞానం
జనక రాజర్షికే ఆయనను గురువుని చేసింది
మనలోని వికార అవగుణాలను పోగొట్టే
ఎంపికలే చేద్దాం.
వికార నామ సంవత్సరంలో
మన మెదడు సామ్రాజ్యానికి
మనమే సామ్రాట్టులవుదాం.
చన్నాప్రగడ (గంధం) జయలక్ష్మి
UGADI Series Part - 3
Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 7th April 2019



Comments
Post a Comment