శార్వరీ చర్విత చరణం

 You can Listen to this Kavitha in the above Audio.

శార్వరీ చర్విత చరణం


రోజూ ఎక్కడెక్కడో తిరిగే 

తుంటరి  "మనసు" తూనీగ 

అరుణకాంతులీనే  “ హృదయ పుష్పం" 

అయస్కాంతంలా ఆకర్షిస్తే 

మురిపించి ముద్దాడ బోయింది.


దేదీప్యమానంగా వెలిగే 

ఆ రాజద్వారాన్ని కప్పేస్తూ 

అసూయ ద్వేషాలనే ద్వారపాలకులు.

ఎలాగో కన్నుగప్పి చొరబడిందా 

ఏమిటా అంధకారం?

 మేరుపర్వతంలా వున్న

“అసంతృప్తి" మేటు అంతటా ఆక్రమిస్తూ.

దానికి వెనక 

మినుకుమినుకు మంటూ 

కొడిగట్టిన దీపంలా  "కృతజ్ఞతా”  మిణుగురు.


అమృతకలశంతో భువికి దిగిన 

వెలుగు పుత్రులైన మనం,

రంధ్రాలు చేసుకుంటూ ఎదుగుతున్నాం.  

భయం, కోపం, అసహ్యం, గర్వం ఇలా ఎన్నో 

మన జీవామృతాన్ని ఖాళీ చేసేస్తున్నాయి.


అత్యాశ-స్వార్థం అనే రాక్షసులు 

ఆత్మశక్తిని పీల్చేసి 

హృదయాన్ని శిలాసదృశంగా 

మృతప్రాయంగా చెక్కుతున్నారు.


జీవంలేని కళ్ళతో 

మోయలేని హృదయభారంతో 

బరువెక్కి పోతున్నాం మనం.


కుళాయినీళ్లు తాగికబుర్లాడుకున్న 

రోజుల్లోఉన్న ఆరోగ్యం,

జెయింట్ వీల్ ఎక్కి

ప్రపంచానికే అధినేతనన్న 

అవధులు లేని సంతోషం  ఏవీ?


అది అమాయకత్వానికి చిహ్నమైన 

చిన్నప్పటి తనం. 

ఈవయసులో మనం ఎదగలేక పోవచ్చు. 

పరిపక్వతతో వికసించలేమా?


ముందుగా మనసుని మచ్చిక

చేసుకోవాల్సిందే  మరి. 

హృదయానికి విషాన్ని సరఫరా చేసే 

వికృత ఆలోచనలను అరికట్టే చర్యలు చేపట్టాలి.


 ప్రేమ-దయ లను 

జీవన ద్వారంలో నిలబెట్టాలి.

ఇంకేముంది !

రక్షణ సరైన చేతుల్లో పడితే,

భయానికీ వేదనకూ 

ప్రవేశమే లేకుండా చేస్తే,

హృదయ కణాల సమావేశంలో 

సరైన వ్యూహరచనే జరిగితే,


పరహితం-ఆశాపూరిత దృక్పథంతో 

 రోగనిరోధకశక్తి  లావాలా

పొంగి తీరుతుంది.

విషాలతోపాటు అసంతృప్తీ 

ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుంది. 

భక్తి-కరుణ అనే నయనాలతో 

"కృతజ్ఞత" విప్పారి చూస్తుంది. 

మనిషి తన సుగుణాల మణిమాలతో 

హృదయానికి ప్రకాశం ఇవ్వడంతో,

హృదయజ్వాలలో ఎన్నాళ్లగానో 

పేరుకున్న చెత్త బూడిద కుప్పై

 విశ్వజనీనత్వ జీవన సూత్రం 

తిరిగి అమృతపుత్రుల ఆవిర్భావమై

నూతన యుగాది

 శార్వరి చర్విత చరణమై


చైత్రపు చిగుళ్ళతో ఊయలలూగుతూ 

శాంతి-ప్రసన్నతలతో

వికసించిన హృదయకమలంలోని

ప్రేమ తేనియను త్రాగుతూ మన తూనీగ 

ఇక కనులవిందు చేయదూ !


చన్నాప్రగడ (గంధం) జయలక్ష్మి


UGADI Series Part - 4

Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 25th March 2020

Comments

Popular Posts