NexGen

 You can Listen to this Article in the above Audio

NexGen




NexGen

Wow

పదంలోనే విన్నూత్నత్వం వెల్లి విరుస్తోంది. గాడ్జెట్స్ లో సరికొత్త జనరేషన్ విడుదల అవగానే పాత దాని విలువ ఠకీమని పడి పోతుంది. Yes నెక్స్ట్ జనరేషన్ మాకు,  వారి తర్వాత తరానికి వారధి లాంటివారు.  ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా  అందుకోగలిగిన  వాళ్ళు. Career, ఇల్లు, పిల్లలు వాళ్ళ అభిరుచులు దేన్నీ వదులుకోకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అభినవ సవ్యసాచులు. తెలివితేటల్లో, కొత్తని అందుకోవటంలో పాతది వదులుకోవటం లో మమ్మల్ని మించిన వాళ్లు.

వాళ్ళని, మీకు బాగా ఇష్టమైన వారు ఎవరు అంటే ఏమని బదులిస్తారు? భాగస్వామి? లేదా మీ ముద్దులొలికే చిన్నారులు. అవునా? తర్వాతే ఎవరైనా. మీ భార్య లేదా భర్తలో మీకు నచ్చనివి ఎన్ని ఉన్నా ఎన్నో సందర్భాలలో మీ ఎంపికకు మిమ్మల్ని మీరు మెచ్చుకుని వుంటారు.  అలాగే చిట్టి బంగారు పాపాయిలను చూసుకుని భగవంతునికి వేలసార్లు కృతజ్ఞతలు చెప్పుకుని ఉంటారు. అవునా!  ఎంత మంచి బహుమతి పొందగలిగామని. ఎన్నో ఆశలు!  వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాలని.

కానీ భార్యాభర్తలుగా మీరు ఒకటయ్యారు అంటే మీ మీ అమ్మానాన్నలు ఎంతో అపురూపంగా చూసుకున్న వాళ్ళ గుర్తులను, గుండె ముక్కలను మీకు బహుమతిగా ఇచ్చారు కనుకే.

పాతతరం కొత్త సాధనాలను వాడుతూ  అప్ గ్రేడ్ అవుతూనే ఉంది. తమ పెద్దల దగ్గర నమ్రతగా మెలుగుతూ తమ సరదాలను అస్తిత్వాలను పక్కన పెట్టింది. మీ తరం కోసం శక్తికి మించి పరుగులు తీస్తోంది. మీ చిన్నారులకూ నచ్చినట్లు ఉండాలి అని తహతహ లాడుతోంది. వారిని అర్థం చేసుకోండి.  మోడల్, మేక్ పాతవి అని తీసిపారేయకండి. వారు  పెరిగిన వాతావరణం అవగాహన అనుభవాలను బట్టి సమయానికి జ్ఞప్తికి వచ్చే జ్ఞానం బట్టి వారి ప్రతిచర్య Reaction ఉంటుంది. ఇది గుర్తుకు పెట్టుకుంటే చిన్న విషయాలు పెద్ద గొడవలు గా రూపాంతరం చెందవు. 

పెద్ద వయసులో ఆరోగ్యపరమైన సమస్యలు,  జీవితంలో నెరవేరని ఆశలు, క్షణం ఎలా ఉంటుందా అన్న  ఆందోళన ఉన్న అమ్మ-నాన్న, లేదా అత్త-మామలకు   కావాల్సింది ప్రశాంతత. తమ పిల్లల పలకరింపు ప్రేమే దానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. మీ పిల్లలు మిమ్మల్ని చూసి అనుకరిస్తారు. అది అనుభవమేగా. 

జీవితం అంటే షడ్రుచులు కలసిన ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రుచులు కలిస్తేనే దానికి రుచి. అలాగే మనిషిలోని అన్ని కోణాలను అంగీకరించ గలిగితేనే రసాస్వాదన. 

ఏతరం వారమైనా అందరం బంధాలకు బందీలం. అందుకే వాటిని ప్రేమ సంకెళ్ల తోనే బంధించుకోగలం.  సద్గురు జగ్గీ వాసుదేవ్  మాటలు ఇక్కడ చక్కగా సరిపోతాయి. బంధాల మధ్య ఉన్న అతి సున్నితమైన గీతని అందరూ మదిలో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన అవగాహనను పెంచుకుంటూ పోగలిగితే, మనస్తత్వాల పరిధిని దాటి మనం ఎదగ గలిగితే,  మన చుట్టుపక్కల ఉన్న అందరిలోనూ అద్భుతాలను చూడగలం.

కొద్ది నిముషాల పాటు ఎదుటి మనిషి లోని తొందరపాటుతనాన్ని అర్థం చేసుకుని ఓర్చుకోగలిగితే వారిని మనం ఎప్పటికీ కోల్పోము.

పెద్దల అనుభవాన్ని  ఆశ్రమాల పాలు కానివ్వకుండ ఊతం కాగలిగిందే  నెక్స్ట్ జనరేషన్  అని ఆశిస్తున్నాను.

 

శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

1st Sep 2015

Comments

  1. నాకు బాగా నచ్చింది. సవివరంగా తరాల అభిరుచులు, అభిప్రాయాలు విడమరిచి చెప్పటం బాగుంది. రెండు తరాల వారధులం సహజంగానే భావోద్వేగాలు మితిమీరిన, ఆత్మవిశ్వాసం కూడా వున్నవారం. ఇమిడిపోయే నైజాం వుండీ భావప్రకటన చేయడానికి వెరవని వారం.

    ReplyDelete

Post a Comment

Popular Posts