O My Man This is too much - By GOD
You can Listen to this Kavitha in the above Audio.
O My Man
This is too much
- By GOD
Photo Captured by me at Horseley Hills on 24th Sep 2019
మానవుడా
నీకు నేను ఏమి లోటు చేసాను
పదే పదే పిలుస్తూనే వుంటావు.
ఇంకా ఏదో కావాలంటావ్!
చక్కటి మానవ జన్మ నిచ్చాను.
నీకు మాత్రమే వుండే ప్రత్యేకత ఆలోచన నిచ్చాను.
నవ్వే స్వేచ్ఛనీ, ఆనందించగలిగే హృదయాన్నీ ఇచ్చాను.
అక్షరంతోపాటు చదవగలిగే నేర్పూ ప్రసాదించాను.
ఎన్ని రకాల ఆసక్తులు నీకున్నాయో
అన్ని మార్గాలూ కల్పించాను.
వాటిని అన్వేషించుకోవడానికి అంతర్జాలమై
నేనే నీ చేతిలోకి వచ్చేసాను.
చల్లటి గాలి, తియ్యటి నీరూ, నోరూరించే పండ్లు,
రాళ్ళతో కొట్టి కోసినా మాట్లాడని చెట్లూ,
క్షుద్బాధ తీరాక సేదతీర్చి అన్నిటినీ మైమరిపించే
గమ్మతైన నిద్రనీ, అనుగ్రహించాను.
ఏమిటీ ! అదే నేను చేసిన తప్పంటావా?
నిన్ను నీవు సుషుప్తంలో పునరుజ్జీవింప చేసుకుని
రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని
నేను చేసిన ఏర్పాటుని నువ్వు "సమాధి" చేసేస్తే ఎలా?
అలౌకిక ఆనందానికి అర్హుడవైన నీవు
దాని ధ్యాసే లేకుండా ఇంకా
తల్లిపాలు తాగే పాపాయిలా
నిద్రాదేవి ఒడి నుండి విడవడవేం?
గ్రీష్మాన్ని తాపం అంటావు. బయటకు రావు.
శీతలంతో మరింత ముడుచుకుంటావు.
చిందులేయాల్సిన వర్షాన్ని చూస్తూ
చీదర అంటూ అడుగే పెట్టవు.
కాలము, కష్టము కూడా
జీవిత పాఠాలు నేర్పే మాష్టర్లే అని
చెప్పినా విననంటావేం?
కర్తవ్యానికీ బద్ధకం దుప్పటిని కప్పేస్తే
సూర్యుడి లేని లోకంలా
జీవితం అంతా చీకటైపోదూ!
ఎంతసేపు విద్యుద్దీపాల కాంతిలో
మిణుగురు పురుగులా బ్రతుకుతావు?
నీ జాడ్యాలన్నీ పోగొట్టే సూర్యకాంతిలో జలకాలాడు.
స్వేద జలాల ద్వారా నీ మానసిక దౌర్బల్యాలనీ
నాశనం చేయగల పతంజలి
నీకోసం యోగద్వారం వద్దే ఎదురు చూస్తున్నాడు.
నువ్వు లేస్తే పలుకరించాలనుకున్న
పక్షుల కుహుకుహూలు
గొంతులోనే మూగపోతున్నాయి.
సుగంధాలతో విరియాలనుకున్న
సుమబాలలు ముడుచుకు పోతున్నాయి.
నువ్వే కనుక భానుడికే స్వాగతం చెప్పగలిగితే
గిలిగింతల చిరుగాలులు
తామరాకు తుషారాలు
నీకే సొంతం అవుతాయి.
నేను నీకు ప్రసాదించిన వరాల మాలతో
నువ్వు శోభిస్తూ, జగత్తునూ
అజ్ఞానపు ముసుగు తీసి జాగృతం చెయ్యి.
నీకిదే నా మేలు కొలుపు
(నా బద్ధకాన్ని పోగొట్టే బాధ్యత దేవుడిదే అనే నాలాంటివాళ్ల కోసం😀)
శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి
Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 28th June 2015



Nice Akka👌
ReplyDeleteThank you 💕
Delete