నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

 You can Listen to this Article in the above Audio

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

 

నమోదేవ్యై జగద్ధాత్త్ర్యై శివాయై సతతం నమః

దుర్గాయై భగవత్యై తే కామదాయై నమోనమః

నమశ్శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే నమః

విశ్వవ్యాప్యై జగన్మాతః జగద్గాత్ర్యై నమశ్శివే || (23-42,43)

 

జగదీశ్వరిని జగన్మాతగా ఆరాధించు కోవటం ఎంతో ఆనందదాయకం. విశేషించి వసంత, శరత్ రుతువులలో మనం అనారోగ్యం పాలు కాకుండా కాపాడటానికి నియమనిష్టలతో కూడిన దేవి నవరాత్రులు కోటి వరాలుగా ప్రసాదించ బడ్డాయి అనుకోవచ్చు.

బాల. కుమారి. గాయత్రి, అన్నపూర్ణ. లలితా త్రిపుర సుందరి, మహా లక్ష్మి, సరస్వతి, దుర్గ, మహిషాసుర మర్ధిని మరియు రాజరాజేశ్వరిగా, ఇలా ముద్దులొలికే చిన్నారి రూపం నుండి ముజ్జగాలనూ ఏలే మాతగా ఆమెను మన ఇంట ప్రతిష్టించుకుంటున్నాం. తల్లి పాదాల చెంత సత్త్వరజస్తమో గుణమయమైన మనః ప్రాణశరీరాలను అర్పించి అహంకార రహితులవటమే దేవి నవరాత్రులు ప్రయోజనం, లక్ష్యం.

 

భారతదేశంలో అనాదిగా స్త్రీలను మూర్తిభవించిన

దేవీ స్వరూపిణిలుగా గౌరవిస్తూనే వస్తున్నారు

 

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

అని మనుస్మృతి.

 

వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి

క్షీరసాగరంలో మాయా లక్ష్మి

అమరావతి స్వర్గలక్ష్మి ఇంటింటా గృహలక్ష్మి

 

వయస్సుతో నిమిత్తం లేకుండా లోకంలోని స్త్రీలందరూ దేవి అంశలే. అంతటా విస్తరించిన తల్లిని దర్శించ గలిగేందుకే కుమారి, సువాసిని పూజలు. వారికి చేసిన వస్త్ర, అలంకార, చందన సత్కారాలు, అర్చన, నివేదనలు ప్రకృతి మాతకు చేసిన మంగళప్రదమైన ఆరాధనలే.

 

దేవి శక్తిని విశ్వరూపంగా మనకు గోచరింపచేసేది దేవీ భాగవతం. అష్టాదశ పురాణాలను అందించినా ఏదో వెలితి  వ్యాస భగవానులకు. దేవీ భాగవతం వెలువరించాకనే సంతృప్తి చెందారు.

 

ప్రకృతిలోని అన్ని శక్తులను మనం స్త్రీ రూపంగానే చూస్తాం. అంటే ఐశ్వర్యం, క్తి అనేది పరాక్రమంకు సంకేతం. రెండింటిని ఇచ్చేది కనుకనే ప్రకృతి శక్తి అయ్యింది. జ్ఞానము, బుద్ధి, సమృద్ధి సంపత్తి, యశస్సు అన్ని కలిపితే భగమ్ అంటారు వాటి స్వరూపము కనుక శక్తికి భగవతి అనే పేరు.

భగవతి తో కూడిన పరమాత్మే భగవంతుడు అయినాడు

 

విశ్వరూపంలో అటువంటి ప్రకృతిని మొత్తం ఓకే స్త్రీ ఆకారంగా చూసినా శివప్రియ, మహాలక్ష్మి, సరస్వతి, సావిత్రి మరియు రాధ అనే పంచరూపాలు ఆరాధన వైశిష్ట్యాన్ని సంతరించుకున్నాయి. ఇంకా ప్రధానాంశాలైన గంగ, తులసి మనసా దేవి, దేవసేన, షష్ఠి, మంగళ, చండిక, కాళిక, వసుంధర అందరూ ఆమె నుండి ఆవిర్భవించిన వారే.

 

యా దేవి సర్వ భూతేషు

స్వాహా, దక్షిణ, స్వధ, స్వస్తి, పుష్టి, తుష్టి, సంపత్తి, ధృతి, సతీ, దయ, ప్రతిష్ట సిద్ధ కీర్తి, క్రియ, విద్య, శాంతి , లజ్జ , బుద్ధి, మేధ, నిద్ర, రేయి, పగలు, సంధ్య క్షుత్, పిపాస, మృత్యు, జరా, తాంద్ర, ప్రీతి, శ్రద్ధ, భక్తి మరియు స్ఫూర్తి ఇలా కనిపించీ కనిపించని శక్తులన్నీ అమ్మ మాయా విలాసాలే

 

మాయాశక్తి కేవలం మోహద మాత్రమే కాదు జ్ఞాన ప్రదాత కూడా. మాయను సృష్టించిన తల్లి మాత్రమే ముక్తిని ప్రసాదించ గలదు. ఆమెకు దయ కలిగే వరకు మనం ఆతల్లిని ఆరాధించడమే మనం చేయగలిగినది.

మనం ఆమె పిల్లలం. ముద్దు చేసినా, దండించినా తల్లికే చెందుతుంది.

తల్లికీ తన బిడ్డ మీద నిజమైన కోపం ఉండదు. వారిలోని దోషాలను తొలగించటానికే కోపాన్ని ప్రదర్శిస్తుంది అంతే. అమ్మ ఔన్నత్యాన్ని చాటే ఇలా చెప్తున్నాయి. దేవీ భాగవతం లోని రెండు శ్లోకాలు.

 

కో పరసహతే లోకే కేవలం మాతరం వినా

బిడ్డ మాటిమాటికి తప్పు చేస్తూనే ఉంటాడు. తల్లి క్షమిస్తూనేవుంటుంది.

ఎందుకంటే

కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి /

యధా మాతాస్తనాంధీనాం శిశునాం  శైశవే సదా/

తథా త్వం సర్వదా

మాతా సర్వేషాం సర్వరూపతః*

 

తల్లి శిశువులుగా ఉన్నంతవరకు మాత్రమే పోషించి రక్షించుకోగలదు. కానీ అమ్మా నువ్వు మాత్రం అందరినీ అన్ని వేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివై సాకుతూనే ఉంటావు.

తల్లినే దైవంగా చూసే మనం జగన్మాత మహత్యమును ఎంతనికీర్తించగలం.

జగదీశ్వరి ఉన్నచోట దోషము ఉండదు జగన్మాత నామ జపం సకల పాపాలను దహించి వేస్తుంది. "భువనేశీ" అంటే చాలు అన్న వాడికి ముల్లోకాలను స్వాధీన పరుస్తుంది. ఇంకా "మాంపాహి" అంటే తానే రుణపడిపోతుందట.

అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే

 

కాత్యాయనీ మహామాయే భవాని భువనేశ్వరి

సంసార సాగరే మగ్నం మాముద్దర కృపామయ్యే

బ్రహ్మ విష్ణు శివ రాధే ప్రసాదం జగదంబికే

మనోభిలషితం దేవి వరం దేహి సమస్తుతే | (5-32)

 

సులభమైన తేట తెలుగులో "దేవీ భాగవతం" అందించిన పూజ్యశ్రీ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులతో🙏


శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 8th October 2019

Comments

Post a Comment

Popular Posts