దివ్య మానసమ్ (Part-1)
You can Listen to this Article in the above Audio
దివ్య మానసమ్
(Part-1)
భారతీయత అంటే ఆధ్యాత్మికతే, మన జీవన విధానంలో నిత్యనైమిత్తిక కర్మలతో అది ముడిపడి వుంది. చెట్టునీ, పుట్టనీ, నదినీ గిరినీ ఒకటేమిటి సృష్టి మొత్తంలోనూ సృష్టికర్తని దర్శించుకునే మనం గుళ్ళూ గోపురాలలో శిలారూపంలో కూడా అనుభూతి చెందుతాం. దగ్గరగా వెళ్ళి మమేకమవ్వాలని తహతహలాడుతుంటాం,
అదే భగవంతుడు మన అందరిలోనూ ఉన్నాడంటారు. ఆయన నివాసయోగ్యం కాగలిగిన మనసును పొందటానికి మన కర్తవ్యాన్ని నిర్దేశించేదే ఈ శివ సంకల్పనూక్తమ్.
చిన్మయ మిషన్ సారధి, పద్మభూషణ్ శ్రీ స్వామి తేజోమయానందగారు బెంగుళూర్ లో చేసిన ప్రసంగాల సారం ఈ దివ్య మానసమ్
"శివసంకల్ప సూక్తమ్".
ఇది పాఠకులను మనుష్యత్వం నుండి దివ్యత్వానికి ఎదగడానికి సహాయపడగలదని ఆశిస్తూ అందుకై ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.
శివసంకల్ప సూక్తమ్
ఈ పేరు వినగానే మనం ఇది శివుని స్తోత్రము అనుకుంటాం. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇది మన మనసును గురించి చెప్పబడింది. “సుష్టు ఊక్తమ్" సూక్తమ్ అంటే బాగా చెప్పబడినది అని అర్ధం. ఆయా దేవతలను కీర్తిస్తూ ఎన్నో సూక్తాలు మనకు ఉన్నాయి. అయితే ఈ శివ సంకల్ప సూక్తమ్ | ఆధ్యాత్మిక జిజ్ఞాసువులనూ, ఋషులనూ కీర్తిస్తూ చెప్పబడినది.
శుక్ల యజుర్వేదములోని వాజసనేయి సంహితలోని 34వ అధ్యాయంలో వచ్చే మొదటి ఆరు శ్లోకాలనే మంత్రాలతో కూడుకున్నదే ఈ శివసంకల్పసూక్తమ్. దీని ప్రస్తావన అన్ని వేదాలలోనూ వస్తుంది.
మనస్సు అనేది మనకు భగవంతుడు ఇచ్చిన వరం, "మనఃఏవ మనుష్యాణాం కారణమ్ బంధ మోక్షయోః" అని ఉపనిషద్ వాక్యం, ఆప్తమిత్రుడై అది. మనలను అత్యున్నత స్థితికి తీసుకెళ్ళగలదు. క్రూరమైన శతృవుగా అధఃపాతాళానికైనా తొక్కేయగలదు.
నిరంతరం అప్రతిహతంగా ప్రవహించే ఆలోచనా స్రవంతే మనస్సు. అందుకే పరమ బద్ధకస్తుని మనస్సు కూడా ఆలోచనల వేగంతో జోరుగానే వుంటుంది. మన ప్రతీ ఆలోచనా ఒక చిన్న నీటి బిందువులా, మెరపులా అంతరాత్మలో ఆవిర్భవిస్తుంది. ఆ బిందువుకైతే ఏ శక్తీ వుండదు. కానీ దానికి వత్తాసుగా మరిన్ని ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తూ చేరినప్పుడు బలపడి తుపాను అలగా మారి వినాశనానికి హేతువు కాగలదు. అదే మనసుని సరియైన ఆదేశాలతో సంకల్పాలతో శుద్ధి చేసి ఏకాగ్రత పరచగలిగితే ప్రబల శక్తిగా మారి ఎన్నో అద్భుతాలను చేయగలిగిన దివ్యమానసం అవుతుంది
అయితే ఈ మనస్సు దేనితో చేయబడినది? "అపంచీకృత పంచ మహాభూతైః కృతమ్" మనస్సు సూక్ష్మ పంచభూత మూలకాలైన ఆకాశం, గాలి, నీరు, నిప్పు మరియు భూమిలతో నిర్మించబడినది. "అన్నమయం రసోయిమనః" రూపాంతరం చెందిన ఆహారమే మనస్సు అంటే మనస్సు = మార్పుచెందిన ఆహారం + సూక్ష్మ జడ పదార్ధాలతో చేయబడిన ఆలోచనల సముదాయం.
పంచ భూతాల పాళ్ళలో మార్పులే మన సత్త్వరజస్తమో గుణాల భరితంగా మనలోని వైరుధ్యానికి కారణం అవుతోంది. మనం ప్రస్తుతం చేసే ఆలోచనల. ద్వారా, కర్మల ద్వారా మన మనఃస్వభావాన్ని రూపాంతరం చేయగలం. "పౌరుషేణ ప్రయత్నేన లాలయేత్ చిత్తబాలకమ్" పట్టుదలతో ప్రయత్నించి పసిబాలుని వంటి మన చిత్తాన్ని బుజ్జగిస్తూ మన అధీనం లోనికి తెచ్చుకోవాలి.
మనసుకి స్వాభావిక ప్రకృతి, కృత్రిమ ప్రకృతి అని రెండు ప్రకృతులు వుంటాయి. ప్రశాంతత అనేది మనస్సు యొక్క సహజ స్వభావం. ప్రకృతిలోని మార్పుల వల్ల నిలకడగా వుండే నీటికి ఆటుపోట్లు వచ్చినట్లే, మన ప్రశాంతత కూడా పరిస్థితుల వలన చెదిరే అవకాశం ఉంది. ఆందోళనలు, దుఃఖాలు మనసులో సృష్టింపబడేవేకానీ, మనసు యొక్క స్వభావం కాదు. వేడి చేసిన నీటిని మూత పెట్టకుండా వదిలేస్తే తిరిగి తన స్వాభావికమైన ఉష్ణోగ్రతను పొందినట్లుగా, కృత్రిమంగా ఆందోళన చెందిన మనస్సును అలా వదిలేస్తే తన స్వభావసిద్ధమైన ప్రశాంతతను పొందుతుంది. ప్రశాంతత కోసం మనం ఏదో చేయవలసిన అవసరం లేదు శాంతిని సృష్టించక్కరలేదు. శబ్దం చేయకుండా ఉండడమే. నిర్మమో నిరహంకారః సశాంతి మది గచ్ఛతి
సంకల్పము అనేది చాలా అందమైన పదం. మనం ఒక పూజ తలపెడితే ఎందుకోసం చేస్తున్నామో సంకల్పం చెప్పుకుంటాం. అక్కడ సంకల్పం ఒక కోరిక. మన నిర్ణయాలూ సంకల్పాలే. కొత్త సంవత్సరం రాగానే ఎంతో ఉత్సాహంగా ఎన్నో సంకల్పాలు చేసుకుంటూ వుంటారు. కొంతమంది దృఢసంకల్పాలు చేయగలుగుతారు. మన సంకల్పాలను బట్టే మన జీవితపు నా
ణ్యత, ప్రమాణం ఆధారపడి ఉంటాయి.
“నేను అనేక మవుదును గాక" అన్న భగవంతుని సంకల్పం నృష్టికి కారణమైంది. ఆయన సంకల్పానుసారం లయమూ అవుతోంది. మనం ఏది ఆలోచిస్తామో అదే మనం అవుతాము. మన ఆలోచన శుద్ధ సాత్విక ప్రకృతిగలదై శ్రద్ధతో చేసినదై వుండాలి.
ఇక శివ అంటే మంగళకరమైనది. మంగళకరము అంటే మన నిజ ప్రకృతికి దగ్గర చేర్చేది. ఆత్మకు విరుద్ధమైన ఆలోచనలు మనల్ని మనం కోల్పోయేలా చేస్తాయి. మనః అనేన ఇతి మనః, మన మనస్సు భౌతిక సుఖాల పట్ల మొగ్గుతుంది. ఆధ్యాత్మికత పట్లా ఆకర్షింపబడుతూ ఉంటుంది, ఆ రెండిటి మధ్య జరిగే సమరంలో ఒక్క అడుగు శుద్ధ చైతన్యం వైపు వేయగలిగితే ఇక జీవితంలో వెనక్కు తిరిగే ప్రసక్తే లేదు. జడ పదార్థాల వైపుకు అది వెళ్ళదు. వాటి ఆకర్షణ అందాలను అవి కోల్పోతాయి. మహిమాన్వితమైన శుద్ధ చైతన్యశక్తి కొలవలేనటువంటిది.
ఏ విధంగా ఒక నీటితో నిండిన పాత్రను అగ్నిమీద పెడితే ముందుగా పాత్ర వేడెక్కి తరువాత అందులో నీరు వేడెక్కినట్లు మన చైతన్యం మనస్సుని దేదీప్యపరిస్తే దాని వెలుగు ఇంద్రియాల మీద, తద్వారా మన ఆలోచనల మీదా ప్రసరిస్తుంది.
మనస్సుని ప్రకాశింపచేసే, ఆ సత్యాన్ని దర్శింపచేసే రుక్కులే ఈ శివసంకల్ప సూక్తమ్ లోని షణ్మంత్రాలు, మనః త్రాయతే ఇతి మంత్ర: మనస్సుని రక్షించడం ద్వారా మనలనూ రక్షించేవే ఈ మంత్రాలు. మనస్సు యొక్క వైశిష్ట్యాన్ని చాటి చెప్తూ ప్రార్ధనా పూర్వక అభిలాషలను మనస్సుకు సంకల్పాలుగా అందివ్వటమే ఈ సూక్త లక్ష్యం
తన్మే మనః శివ సంకల్పమస్తు అనే ఆశీర్వాద మకుటముతో ప్రతీ శ్లోకమూ పూర్తి చేయబడినది. అటువంటి విశిష్టమైన నా మనస్సు ఎప్పుడూ మంగళకరమైన ఆలోచనలతో నిండి వుండుగాక అని దానర్ధం.
మహత్తరమైన మంత్రాలకు సుదీర్ఘ ఉపోద్ఘాతం తప్పనిసరి అయ్యింది. రండి ఆ దివ్య మానసాన్ని దర్శిద్దాం
శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి
Published by G.S.R Impressions RAJAMAHENDRI Dated 1st March 2017



Super మనసు అంతా ఆనంద అనుభూతి తో పొంగి పొర్లి ప్రవహిస్తోంది
ReplyDeleteNice Akka.'Manasu' equation kottaga vundi.
ReplyDelete🙏
ReplyDelete🙏
Delete