దివ్య మానసమ్ (Part-2)
You can Listen to this Article in the above Audio
దివ్య మానసమ్
(Part-2)
శివ సంకల్ప సూక్తమ్
మంత్రం : 1
యజ్ఞాగ్రతో దూరముదైతి దైవం
తదుసుప్తస్య తద్వేవేతి
దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం
“తన్మే మనః శివ సంకల్పమస్తు"
జాగ్రదావస్థ అంటే కంటికి కనిపించే భౌతిక ప్రపంచాన్ని అందులో వస్తువులను ఇంద్రియాల సహాయంతో అనుభూతి చెందే మెలుకువ స్థితి. పంచేంద్రియాలతో ముడిపడిన మనసుని అవి
(ఇంద్రియాలు) అన్ని ప్రక్కలకూ తీసుకుపోతాయి. ఎన్నో సంకల్ప - వికల్పాలు ఆలోచన రూపంలో చేస్తుంది మన మానసం. దైవం నుండి సత్యం నుండి ఎంత సుదూర తీరాలకైనా తీసుకు వెళ్ళతాయి ఆ ఆలోచనలు.
జ్యోతి స్వరూపాలైన ఇంద్రియాలకే వెలుగునిచ్చే మహత్తర చైతన్య జ్యోతి అయిన మనస్సు నిద్రలో మనలో లీనమైపోతుంది. అటువంటి మనస్సు తన ప్రకాశాన్ని కోల్పోతే మన కళ్ళముందే జరుగుతున్నదేది చూడలేము. వినలేము. మెలకువగా వున్నప్పుడు ఎటువంటి సంకల్పాలతో ఏ మార్గంలోనికి పయనిస్తుందో అన్న గమనిక ముఖ్యం. ఎంత శాంతి, సంతృప్తి పొందగలగుతున్నాం అన్నది ఆ సంకల్పాల పైనే ఆధారపడి వుంటుంది.
విద్యార్థి సంకల్పం ఎప్పుడూ విద్యార్థనే కావాలి. సన్యాసి సంకల్పం జ్ఞాన భక్తి వైరాగ్యాలకు చెందినదిగా ఉండాలి తప్ప ధనార్జన కారాదు.
బ్రహ్మ
నారదునితో ప్రతీ హృదయంలోను భక్తిని నెలకొల్పమనే సంకల్పముతో సంచారం చేయమని ఆదేశించాడు.
సుషుప్తిలోనికి జారుకునే ముందు మనం ఎటువంటి ఆలోచనలతో నిద్రపోతున్నామో పరిశీలించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అదే ఆలోచనలతో మన మరుసటి రోజు ప్రారంభం అవుతుంది.
మన ఆలోచనలు నిన్నటి లాగానే వుంటే మన జీవితం ఇవాళా అలాగే వుంటుంది. అద్భుతాలు జరగవు., మన గమ్యాన్ని తెలుసుకోకుండా చేసే ప్రయాణం అగమ్య గోచరమే కదా.
గాఢమైన నిద్రలో మనకు వేరే ప్రపంచం వుండదు, నిరంతర ఆనందం తప్ప. అయితే అంత అలౌకికమైన ఆనందదాయకమైన నిద్ర నుండి గతజన్మ లోని మన కర్మ ఫలాలను అనుభవించటానికే లేస్తాం.
భగవంతుని స్మరిస్తూ, సదాలోచనలతో విశ్రమించేవారు మేలుకున్నప్పుడు తమ కర్తవ్యాలను నిర్వర్తించుకోవడానికి ఉత్సాహంగా లేవటమే కాకుండా వారి నిద్రకూడా అద్భుతమైన సేదతీర్చే వరంగా మారుతుంది. నిద్రపట్టక పోవటం, భయంకరమైన కలలు వుండనే వుండవు.
ఆత్మజ్ఞానికి గాఢనిద్ర ధ్యానంతో సమానం. నిద్రని మంగళప్రదం చేయాలంటే పడుకునేటప్పుడు శుభ సంకల్పాలతో పడుకోవాలి. నిద్ర ఎప్పుడు వస్తుందో మన చేతిలో లేకపోవచ్చు గానీ, ఎటువంటి ఆలోచనలతో నిద్రపోవాలన్నది మన ఎంపికే.
మనస్సు శివసంకల్పాలతో నిండి వుంటే శివమయం అవుతుంది. ఇందుకు మనం చేసుకోవాల్సిన సంకల్పాలు ఎలా ఉండాలో చూద్దాం.
1. నా మనసు ఇవాళ జరిగే అన్నిటి యందు భగవంతుని కృపను చూడగలదు గాక.
2. దేవుని పట్ల నా ప్రేమ అధికమవుతూ ప్రపంచం పట్ల అది దైవత్వాన్ని పొందగలదు గాక!
3. ఈ ప్రపంచంలో నేను చాలా పరిణతి చెందిన అవగాహనతో వ్యవహరించెదను.
4. ఈరోజు నేను గడించే జ్ఞానము, వివేకము సంపన్నమైన నా అంతర్ దృష్టిని పెంపొందించగలదు.
అదే విధంగా భక్తి జ్ఞాన, శాంతి సంతోషాలతో కూడిన నిధులతో ఇంటికి చేరతాము.
పడుకునేటప్పుడు కూడా ”నేను చక్కగా విశ్రాంతి తీసుకుని ఎంతో తాజాగా లేవగలను, నా కర్తవ్యాలను నేను సరిగ్గా పాలించెదను” అని తీర్మానం చేసుకుని పడుకోవాలి.
మన ఆలోచనలు మనల్ని వర్తమానం నుండి గతంలోకి, భవిష్యత్తులోకి పరుగులు తీయకుండా ఇలా ఆదేశించాలి.
"నా మనస్సు దేశకాల వస్తువులకు అతీతమైన, సత్యమైన దానిని పొందటానికై ఎక్కడికి ప్రయాణించాలో అక్కడికే వెళ్ళగలదు. ఏది తెలుసుకోవాలో అదే తెలుసుకోగలదు. దేదీప్యమానమైన వర్తమానంలోనే అది విహరించగలదు”
శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి
Published by G.S.R Impressions RAJAMAHENDRI Dated 1st March 2017



🙏 difficult to follow, once you start following, happiness and peace of mind can be attained
ReplyDeleteSo true🙏
Delete