దివ్య మానసమ్ (Part-5)

  You can Listen to this Article in the above Audio

దివ్య మానసమ్

(Part-5)



శివ సంకల్ప సూక్తమ్

మంత్రం : 4

 

యేనేదం భూతం భువనం భవిష్యత్

పరిగృహీత మమృతేన సర్వమ్

యేన యజ్ఞస్తాయతే సప్తహోతాః

తన్మే మనః శివ సంకల్పమస్తు

 

మనసుకు మరణం లేదు. అందుకే దానికి భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు. అటువంటి మనస్సులో సప్త ఋషులు అగ్ని కార్యాలు నిర్వర్తిస్తూ వుంటారు. అటువంటి నా మనస్సులో అన్నీ శుభసంకల్పాలే ఉండుగాక! అని అర్థం.

కాలము అనేది మనసు భావన. సంతోషంగా వున్నప్పుడు కాలం పరిగెట్టడం, బాధలో వున్నప్పుడు భారంగా నడవడం మనకు అనుభవమే.

గతకాలపు బాధాకరమైన భూతకాలంలో,  లేదా భవిష్యత్తుని గురించిన  ఊహలతో  కాలాన్ని వృధాపరచి అతి ప్రధానమైన వర్తమానాన్ని చేజార్చుకుంటుంటాం.

శుద్ధ చైతన్యానికి భూత వర్తమాన భవిష్యత్తులు మొత్తం ప్రతీదీ తెలుసు. అటువంటి పూర్ణ చైతన్యానికి ఎవరైతే అనుసంధానులై వుంటారో వారూ త్రికాలజ్ఞులు అవగలుగుతారు. సత్పురుషులు దైవీగుణాలతో జ్ఞానంతో శోభిల్లుతూ ఉంటారు

ఏడుగురు హోతలు చేసే అగ్నిస్తోమ హోమంలో హవిస్సులు అగ్నిలో వేసే ముందు ఏ ప్రయోజనాన్ని ఆశించి, వారు ఆ యజ్ఞాన్ని చేస్తున్నారో సంకల్పాన్నిచెప్పి ఆరంభిస్తారు. ఇది యజ్ఞకార్యంలో చాలా ముఖ్యమైన విధి. మంగళకరమైన సరియైన ప్రయోజనార్ధమే యజ్ఞాలు నిర్వహిస్తారు.

మనం కూడా నిత్యం ఓ అగ్నికార్యం చేస్తున్నాము. ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో ఏడుగురు ఋత్విక్కులు మన రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు నాసికారంధ్రాలు, ఒక నోరు, ఇవన్నీ మన మనస్సుకు ఆహుతులు సమర్పిస్తున్నాయి. మనం చూసేది, వినేవి, ఆఘ్రాణించేవి, భుజించేవి, మాట్లాడేవి, అన్నీ అన్నింటా సరియైనవి గొప్పవి అయి ఉండాలి. హోమ ద్రవ్యాలు పవిత్రత పట్ల హోతలు చూసే శ్రద్ధనే మనమూ పాటించాలి. అప్పుడే మన మనస్సు ఎప్పుడూ పవిత్ర చైతన్యంతో విరాజిల్లుతుంది. పరిమితంగా భుజించడం కూడా భగవంతుని ఆరాధనలో భాగమే.

ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన సంకల్పాలు:

1.    నేను మంగళకరమైన వస్తువులనే చూసెదను. మంగళకరమైన శబ్దాలను వినెదను.

2.  నా మనసు కూడా భగవంతునితో అనుసంధానం చెంది మంగళకరమైన భవిష్యత్తు పొందుగాక!

ఆత్మ సర్వజ్ఞ ఎప్పటికీ నాశనము లేనిది. అదే విధంగా మనసూ అమరమైనది. అటువంటి మనసు ఎల్లప్పుడూ మధురమైన అమృతతుల్యమైన ఆలోచనలు కలిగి వుండు గాక!

శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

Published by G.S.R Impressions RAJAMAHENDRI Dated 1st March 2017

Comments

Popular Posts