దివ్య మానసమ్ (Part-6)

   You can Listen to this Article in the above Audio

దివ్య మానసమ్

(Part-6)



శివ సంకల్ప సూక్తమ్

మంత్రం : 5

యస్మిన్నృచః సామ యజూంషి,

యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభావివారాః

యస్మిం శ్చిత్తం సర్వమోతం ప్రజానాం

తన్మే మనః శివ సంకల్ప మస్తు

పవిత్ర మనస్కుల గురించి, మరియు పూర్ణ చైతన్యంలో అయితే ప్రతీ వ్యక్తి చైతన్యం

ద్యోతకమవుతుందో అటువంటి పూర్ణ చైతన్యాన్ని ప్రశంసిస్తూ చెప్పిన శ్లోకమిది.

 

“వేదాలు” ఋషులు ధ్యానంలో దర్శించినవి. పద్య, గద్య గీత రూపంలో వున్న ఇవే మన జ్ఞానానికి మూలాలు. ఇవన్నీ పూర్ణ చైతన్యంలో నిక్షిప్తమై వున్నాయి. భగవంతునికి ఉన్న జ్ఞానము మన మనస్సులలోనూ వుంది. కాకపోతే మనం మన చైతన్యాన్ని పూర్ణ చైతన్యానికి అనుసంధానపరచవలసి వుంటుంది. విధంగా కంప్యూటర్ ను వరల్డ్ వైడ్ వెబ్ కు అనుసంధించి చిటికెలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నామో అదే విధంగా పూర్ణ చైతన్యంకు అటువంటి సంధానం కలిపితే మన మనస్సు అన్నీ గ్రహించగలదు.

మనస్సు అయితే సకల వేదమంత్రాలను కలిగి వున్నదో చక్రపు నాభి వద్ద దాని ముళ్ళు అన్ని కేంద్రీకృతమైనట్లు. పూర్ణ చైతన్యుడైన భగవానుడి చైతన్యం లోనివే వేదమంత్రాలు. సృష్టి చైతన్యం ఆయనలోని భాగమే అయినప్పుడు ఆయన పూర్ణత్వంలోని తునకే మన చైతన్యం. సముద్రంలోని ప్రతీ బిందువులోనూ వుండేది సముద్రమేగా!

వేదమంత్రాలు ఆయన అధీనంలో వుండటం వలన పూర్ణ చైతన్యం వేదమయం. జ్ఞానమయం ధర్మవయం అయింది. ఎప్పుడైతే మన చైతన్యం అందులో భాగమో మనదీ వేదమయం. అందుకే మన చైతన్యాన్ని మనం పవిత్రంగా వుంచుకోవాలి.

వేదాల సారం భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవతాల్లో నిక్షిప్తమై ఉంది. మనం వాటిలోని ఆదేశాలను ఆచరించి పాటించడం ద్వారా మన మనస్సుని పవిత్రం చేయగలం. ఆదేశ పూర్వకమైన ధర్మాచరణ సాగిస్తూ,  మానవ జీవిత ధ్యేయమైన సత్యాన్వేషణ సాగించే మనిషి చైతన్యం వేదమయం.

వేదమంత్రాలు మనకు జీవిత ధ్యేయానికి సంబందించిన జ్ఞానమే కాకుండా ధ్యేయాన్ని సాధించటానికి తగిన ఉపాయాన్నీ సూచిస్తాయి.

 

సత్యం వద

ధర్మం చర

సత్యాన్ ప్రమధి తవ్యం

ధర్మాన్ ప్రమది తవ్యం

మాతృదేవో భవ

పితృదేవో భవ

ఆచార్య దేవో భవ

ఇలా ఎన్నో ఆజ్ఞలు! మనం పాటించగలిగితే మన చైతన్యం పరిశుద్ధ మవుతుంది. అప్పుడు మన ప్రతీ చర్య, ప్రతిస్పందన, ధోరణి పవిత్రమవుతాయి సంత్ జ్ఞానేశ్వర్ ను గేదె చేత వేదగానం చేయించగలరా అంటే భగవంతుడు. తలచుకుంటే చేయగలడు అని చేయించి నిరూపించాడు.

మూకం కరోతి వాచాలం

పంగుంలంగ్యతేగిరిం

యత్కృపా త్వమహం వందే

పరమానంద మాధవమ్

జ్ఞానం చాలా విస్తృతమైనది. లోతైనది. భగవంతుని పూర్ణ చైతన్యంతో అనుసంధానం కాగలిగిన వ్యక్తి చైతన్యం లోనికి జ్ఞానం నిరాటంకంగా ప్రవహిస్తుంది.

అందరి చైతన్యం ఆయనలోనే వుండటం ఎలా సాధ్యమో ఉదాహరణ వెల్లడి చేస్తుంది

కలలో మన ఒక్కరి మనసే కలలోని పాత్రలన్నిటినీ కల్పిస్తుంది. శాసిస్తుంది. స్వప్నంలో వున్న వారి సంఖ్య ఎంతైనా, వారి అందరి ఆలోచనా స్వప్నాన్ని దర్శిస్తున్న వారి నుంచి జనించినదే. మరి సృష్టి అంతా పరబ్రహ్మ రచనే కదా! అందుకే మనం చాలా అల్పులమైనా మనకు అండగా దన్నుగా మన వెనకాల భగవంతుడు వున్నప్పుడు మనం ఆయనతో అనుసంధానం కాగలిగినప్పుడు, ఆయన అంశగా అవే లక్షణాలను కలిగి ఉంటాం. విడివిడిగా మనందరం పిపీలకలం, శూన్యం. కానీ అంతా ఒక్కటైన ఆయనతో జోడించినప్పుడు పూర్ణం కాగలం. ఒకటి పక్కన చేరిన సున్నాలాగా. ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నామనేదే అత్యంత ప్రధానమైనది.

ఇక్కడ మనం చేసుకోవాల్సిన సంకల్పం ఇలా ఉంటుంది

నా మనస్సు భగవంతునితో అనుసంధానం చెంది వుండుగాక.

దానికి అవరోధంగా వున్న అడ్డంకులన్నీ తొలగుగాక!

జ్ఞానానికి అనువుగా నా మనస్సు మారుగాక!

అందరి బుద్ధికీ ఆధారమైన సనాతనమైన సత్యాన్ని నేను తెలుసుకుందుగాక.

 

శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

Published by G.S.R Impressions RAJAMAHENDRI Dated 1st March 2017

Comments

Popular Posts