పాంచభౌతికం
దేహాత్మ భావన వీడనప్పుడు బాధపడకుండా
దాని లోతుల్లోకే వెళదామని,
ఎలా ఈ ఆకారాన్ని పొందానో చూద్దామని
ఇలా ఊహించా.
భూమి
నువ్వు ప్రధానంగా దేనితో తయారయ్యావో అదే నీలోని భూతత్వం
భూమి ని మట్టి అనుకుంటే
తనని పారలతో తొలచినా గునపాలతో త్రవ్వినా
మెత్తబడుతూనే ఉంటుంది కన్నతల్లి లోని ఓర్పులా
నా ఆత్మ విశ్వాసం ను నేను
నాలోని భూమి తత్వంగా దర్శించుకుంటున్నా.
అవును ....
అనుభవాలతో హృదయం ఘనీభూతమవకుండా
మరింత సారవంతమై...
మృదుత్వంతో సాధిస్తుంది
కానీ సడలిపోదు.
జీవిత సమరంలో ధైర్యంగా ముందడుగు వేస్తూ . ..
నీరు
పాత్రను బట్టి మారే ఆకృతి
మనం ఎన్నో పాత్రలను పోషిస్తూ ఉంటాం
దానికి తగ్గట్టే ఆహార్యాన్ని అనుసరిస్తాం
ప్రవాహం నీటి తత్వం
అదే నాలోని స్వతస్సిద్ధమైన ప్రేమతత్వం
నీరు ఒకేచోట ఎలా ఉంటుంది? నాచు పట్టదూ?
అందుకే అందరి మీదా
చిరు నవ్వుల (జల్లుల )
ప్రేమ వర్షం
అవును ..
నీరు జనజీవన ప్రాణధార
ప్రేమ మన మానసిక వికాస జీవధార
అగ్ని
పాపాలన్నీ దగ్ధం చేసి పునీతుల్ని చేసే నిరాకారి.
జిజ్ఞాసాగ్ని జఠరాగ్నికన్నా జ్వలిస్తూనే ఉంటుంది.
నాలోని అగ్నితత్వం అహేతుకమైన
నా ప్రవర్తననే నిలదీస్తుంది
నిలువునా దహించి వేస్తుంది
ఏదో సాధించమని నన్ను ఎగదోస్తుంది
అవును ...
అశాంతి, అసంతృప్తి, నిరాశ లాంటి ఎండుటాకులను తగలబెట్టడటానికై
ఉల్లాస ఉత్సాహాలనే అనే నిప్పుకణాలను రగిలిస్తూ ప్రజ్వలిస్తూ..
వాయువు
ఇక వాయు తత్వం నైర్మల్యానికి ప్రతిరూపం
ఉచ్ఛ్వాస-నిశ్వాసల ప్రాణశక్తి జనితమైన నా వాక్కులు
ఎటుపడితే అటు వీచకుండా హెచ్చరిస్తూ ఉంటుంది,
"నీ మార్గం శీతల పవనాల స్వాంతన వచనాల
సాత్విక సత్యం"
అని
ముంగురులను తోసి మరీ చెవిలో గుస గుస లాడుతుంది
అవును ...
మంచి-చెడు అని బేరీజు వేయకుండా
అంతటా అన్నిటా నిండుగా వ్యాపిస్తూ ఉండే గాలిలా
గుణ బేధాలు ఎంచక అందరినీ అన్నిటినీ కలుపుకుంటూ..
ఆకాశం
చిదాకాశం ఎప్పుడూ వినీలాకాశం లోనే విహరిస్తూ ఉంటుంది.
అనంతాన్ని శోధిస్తూ
ఏమీ అంటించుకోని అంబర స్వచ్ఛతకు
అబ్బుర పడుతూ
విశ్వచైతన్యంలో మమేకమవుతూ
లీనమై ..
లుప్తమై..
అవును ...
శూన్యంలో నిరాకారినై
తిరిగి కొంగొత్త కణాల సముదాయినై
సాకారినై
సర్వస్య శరణాగతినై
అర్థినై
పంచభూతాత్మికనై
శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి
బెంగుళూరు
Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI
Dated 13th April 2021 – Plava Naama Ugadi



Comments
Post a Comment