ఆహ్లాదాల అజాతశత్రువు
You can Listen to this Kavitha in the above Audio
చీకటి దుప్పటి ఇంకా పరుచుకుని ఉండగానే వెన్నెల తెల్లదనపు చిరునవ్వులతో బ్రాహ్మీ ముహూర్తంలో నాన్న వెలుగులు ప్రసరిస్తూ, క్రిందకు - అదే ప్రెస్ లోకి వెళ్ళేవాడు.
పొద్దు పొడిచే సమయానికి సమాచారాన్ని లెక్కించడానికి కామా పెట్టి, కప్పు కాఫీ కోసం పైకి వచ్చేవాడు.
నాన్న మెట్లెక్కి రావటాన్ని తమ్ముడు కృష్ణే వర్ణించాలి. ఎందుకంటే పెద్ద వాళ్ళందరం అప్పటికే నిద్రలేచేసే వాళ్ళం. నాన్న కొద్దిపాటి దగ్గు లాంటి హెచ్చరిక చేస్తూ మెట్లు ఎక్కేవాడు. అదే ఆ గొంతు సవరించుకోవడమే వాడికి అలారం. అధాటున లేచేసేవాడు😂.
అలా మొదలైన కాఫీ సేవనం రోజంతా ఏమోయ్! "కొద్దిగా"
అంటూ అమ్మను అడుగుతూనే ఉండేవాడు. ఇంటికి ఎవరు వచ్చినా వారితో పాటు కొంచెం అంటూ ఇష్టంగా తాగేవాడు.
ఇంకా మా ఇంట్లో అందరికీ నాన్న నుంచి సంక్రమించిన మరో అలవాటు, ఈ కాఫీతో పాటు వార్తా సంగ్రహణం. అవును మా సమాచారంతో పాటుగా మా ఇంటికి వచ్చే అన్ని పత్రికలను ఓ రౌండ్ చూసే వాళ్ళం. పెద్దవాళ్లు న్యూస్, నాలాంటిది కాలం దాటని కథలు, మా కృష్ణ స్పోర్ట్స్ విభాగం - ఇలా మాకు నచ్చినవన్నీ ఏ తొందరా లేకుండా చదివినా , చాలా ప్రశాంతంగా సాగేవి మా ఉదయాలు.
నాన్న చొక్కా జేబులు అన్నింటికీ ఇంక్ ట్రేడ్ మార్క్ లా ఉండేది. ఇక నాన్న ఊర్లో జరిగే కార్యక్రమాలకు వెళ్ళిపోయేవాడు. మీటింగ్స్ కు ఏనాడూ ఆలస్యంగా వెళ్ళటం లేదు. కొన్నిచోట్ల నాన్న ప్రసంగించేవాడు. అది ఏ కార్యక్రమమైనా ఆహ్వానం వచ్చిందంటే హాజరు అవ్వాల్సిందే. పెళ్ళిళ్ళ సీజన్లో ఊర్లో నాలుగు మూలలకూ పరిగెట్టాల్సి వచ్చినా ఎవర్నీ నిరాశపరిచేవాడు కాదు.
చిన్ననాటి స్మృతులు నాన్న ఎన్నో మిగిల్చాడు. ఎన్నో సంవత్సరాలు దాదాపు 3 దశాబ్దాల పైన కాలం గడిచాక ఇలా అన్నీ నెమరు వేసుకుంటూ ఉంటే, అదొక వంక ఆయన మార్గదర్శకత్వం పట్ల గర్వం, మరొక ప్రక్క అటువంటి నిరాడంబరమైన, అందరికీ సమానంగా ప్రేమ పంచే ఆత్మీయత మరల ఆత్మను స్పృశించి చెమర్చే నేత్రద్వయం.
నిద్రలేపి మీగడ పెరుగు ముద్దలు తినిపించిన నాన్న నా పసితనపు గుర్తు.
ఎక్కడ భోజనానికి వెళ్ళినా కిళ్ళీ తెచ్చి నాకు ఇచ్చిన నాన్న నా ఆటల వయసు జ్ఞప్తి.
స్వీట్స్ అంటే ఇష్టంగా తినే నాన్నకు అందరూ అపురూపంగా ఎన్నో తెచ్చిపెట్టినా అమ్మ చేసి దాచిపెట్టినవి దొంగతనంగా తినే 60 లోను ఆయన అల్లరి మధుర స్మృతి.
మామిడిపండు అన్నివైపులా నొక్కి రెండు పండ్లు పెరుగు అన్నంలో తింటేనే కానీ తృప్తి లేదనేవాడు.
మామిడిపండు ఆకారంలో ఉన్న తన కండలను పిల్లలకు చూపించి సంతోషపెట్టేవాడు.
నాన్నతో గోదావరి స్నానం గమ్మత్తే వేరు. ఇక్కడ మునిగి ఎక్కడో లేచేవాడు. అప్పుడు పేర్లయితే తెలీదు కానీ ఎన్నో రకాల ఈతలు కొట్టేవాడు.
ఇంకా చాలా చాలా నన్ను ఆ రోజుల్లో అబ్బుర పరిచింది - నాన్న ఆఫీస్ రూమ్ లో ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఉండేవి. ఎప్పుడు ఎక్కడ వేలుపెట్టి అదేం దేశం, ఏ ప్రదేశం అని అడిగితే చాలు ఠక్కుమని చెప్పేవాడు.
ఇంకా నాన్నకు నాకు మధ్య మరొక ప్రహసనం నడిచేది. నేను చదివిన స్కూల్లో నాన్న ఫంక్షన్ కి అప్పుడప్పుడు గెస్ట్ గా కూడా వస్తూ ఉండేవాడు. మా స్కూల్లో ఆగస్టు 15 జనవరి 26 ఇలాంటి సందర్భాలలో విద్యార్థుల ప్రసంగాల్లో నాది తప్పనిసరిగా ఉండేది. వాటిని నాన్న రాసి ఇస్తే నేను బట్టి పట్టి చెప్పేదాన్ని. ఒకసారి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకానికి అన్ని సూత్రాలూ రాసేశాడు. నేనూ అలాగే చెప్పగలిగాను.
ఇక బంధువులందరికీ తను రాసినట్లుగా నా చేత ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. అదే నా లేఖా ప్రావీణ్యానికి హేతువు.
ఇంకా నాన్న చిన్న పత్రికల సమ్మేళనాలు దేశంలో ఏ మూల జరిగినా వెళ్లేవాడు. వచ్చేటప్పుడు ఎన్నో బహుమతులు పిల్లలందరికీ తెచ్చేవాడు. పిల్లలు అంటే మా మైదవోలు వారి ఇంట్లో అద్దెకు ఉన్న పిల్ల జనాభాను కలుపుకొని అన్నమాట చుడీదార్లు గొలుసులు స్వీట్స్ బొమ్మలు బ్యాగులు ఇలా ఎన్నో .
పిల్లలు అంటే నాన్నకి ప్రాణం వాళ్ళని చక్కగా పెంచాలి, చిన్నతనంలోని వారి మైలురాయి లన్నీ నోట్ చేయాలి అని అనేవారు.
దేశాటనంతో అన్ని ప్రాంతాలు మాకు చూపించాలని చాలా తాపత్రయపడేవారు. మా తోబుట్టువులు లో కొంతమందిని తీసుకువెళ్లారు కూడా.
నాన్నతో రైలు ప్రయాణం భలే సరదాగా ఉండేది. రాబోయే స్టేషన్ పేర్లు మీద ఆడించేవాడు. అంతెందుకు నాన్నతో ఉన్న సమయమంతా ఆనందంగా సరదాగా గడిచిపోయింది.
ఇలా చెప్తుంటే ఈ ముచ్చట్లకు అంతే ఉండదు.
నాన్న ఏర్పాటు చేసిన సభలు మాకు ఏదైనా నిమిషాల్లో నిర్వహించగల నైపుణ్యాన్ని ఇచ్చాయి.
నాన్న ఇంటికి ఎంతో మహామహుల్ని ఆహ్వానించడం వలన ఎవరితోనైనా బెరుకు లేకుండా మాట్లాడే స్థైర్యం, చొరవ వచ్చాయి.
నాన్న సహాయ పడే తత్వం ఏ తారతమ్యం లేకుండా అందర్నీ ప్రేమించే గుణాన్నిచ్చింది
ఎంత జబ్బులో ఉన్నా తనని చూడడానికి వచ్చే వారితో నవ్వుతూ, తన మానసిక ఆరోగ్యాన్ని చాటే ఆయన తత్వం సానుకూల దృక్పథాన్ని నేర్పింది.
మంచంలో హాస్పటల్లో ఉన్నా వార్తా సేకరణ మానకుండా వృత్తి పట్ల నాన్నకు ఉన్న అంకితభావం ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది.
నాన్నతో ఎక్కువగా గడిపింది నేనే. అవును. కన్నతల్లీ అని నాన్న ప్రేమగా పిలుచుకునే వాడు. అమ్మలూ నీకు దేశం చూపించలేకపోయాను అనుకునేవాడు. తన అనుభవాలు జ్ఞాపకాలు నా చేత రాయించాలనుకున్నాడు.
సుందర చైతన్య స్వామివారిని అభిమానించేవాడు.
ఈరోజున తలుచుకుంటే -
"నాన్న ఎన్నడూ అమ్మ పై కానీ ఎవరిపైనైనా, కోపం చూపించడం తెలియదు.
పిల్లలను ఎప్పుడూ పనికిరాని వాడివి అవుతావు అన్నది లేదు.
తన కార్యాలయంలో పనిచేసే వాళ్ళ మీద అరిచిందీ లేదు.
రామరాజ్యంలా... ఆయనది పౌర్ణమి నాటి వెన్నెల నవ్వుల రాజ్యం. ఆయన సాన్నిత్యం మండే వేసవిలో చల్లటి కుండనీటి తియ్యదనం.
నాన్న మూర్తీభవించిన మంచితనం.
విలువలకు ప్రాధాన్యతను ఇచ్చే ఆయన వ్యక్తిత్వం సుగంధాల సౌరభం.
**********నాన్న శతజయంతి సందర్భంగా, కుటుంబంలో ఇష్టా గోష్టి గా పంచుకున్న నా ముచ్చట్లు 😍************



సుగంధానాకి నిలువుటద్దం ఆంజనేయులు పెద్దనాన్న. అజాత శత్రువు. పెదన్నాన ఆదర్శమూర్తి. ప్రేమ మూర్తి.
ReplyDeleteసుగంధానాకి నిలువుటద్దం ఆంజనేయులు పెద్దనాన్న. అజాత శత్రువు. పెదన్నాన ఆదర్శమూర్తి. ప్రేమ మూర్తి. పెద్దనాన్నకు నా ఘన నివాళులు💐💐💐
ReplyDelete🙏
ReplyDelete