తన శాంతమే తనకు రక్ష

 




తన శాంతమే తనకు రక్ష

 

చూత చిగురుల నేవళత్వం

వేప పువ్వుల మృదుత్వం

కొత్త బెల్లపు ఉప్పదనం

నోట నీరూరే చింతల పుల్లదనం

పిప్పైనా చెఱకు మిగిల్చే తీయదనం.

 

గుత్తులుగా వ్రేలాడే మావి పిందెల సోయగం

విచిత్ర వర్ణ శోభలతో  వసంతుని విశ్వరూప సందర్శనం

ఉగాదికే సొంతమైన ప్రకృతికన్య పరవశత్వం.

 

రాబోయే సంవత్సరంలో రాజు ఎవరు బంటు ఎవరు

రాజపూజ్య అవమానాలేంటి

ఆదాయ వ్యయాలేమిటి అంటూ ముందస్తుగా  ప్రపంచంతో మొదలై వ్యక్తుల భవిష్యత్తుని నిర్దేశించే

" పంచాంగ శ్రవణం ".

 

గండు కోయిల గానాన్ని

కొత్తగా ఆవిష్కరించే నవ కవుల

" కవితా పఠనం ".

 

వసంత నవరాత్రులు

శ్రీరామనవమి సంబరాలు

జమిలీగా మోసుకొచ్చే

నూత్న వత్సరాది ఉత్సవాలు.

 

అరవై వర్షాలకు వేటికవే ప్రత్యేక నామాలు

క్రోధి నామ సంవత్సరంలో

క్రోధానికి కారణాలు కనిపెడదాం

తన కోపమే తన శత్రువు అని

అది తెచ్చే చేటు మన ఆరోగ్య, సంబంధాలపై వేటు అని గ్రహిద్దాం.

 

ఈనాటి నుండి క్రోధాన్ని ప్రేమతో ముంచేద్దాం

అనురాగపు బీజ సేద్యంతో అనుబంధాల ఫలసాయం పొందేద్దాం.

 

బంధాల నడుమ ఉండాల్సిన సునితత్వాన్ని గౌరవిద్దాం

భరతావనిలో వసుదైక కుటుంబానికి ఉమ్మడి కుటుంబ నేపథ్యమే బలమని నిరూపిద్దాం.

తన శాంతమే తనకు రక్ష అని చాటుదాం.

 

--- చన్నాప్రగడ (గంధం) జయలక్ష్మి బెంగళూరు





Comments

  1. Kavitha is so nice atta 😄😄 You covered everything about Ugadi 🎊 Happy Ugadi 🎊🥳

    ReplyDelete

Post a Comment

Popular Posts