చిరంజీవి- ప్రాతః స్మరణీయులు

 You can Listen to this Article in the above Audio

చిరంజీవి- ప్రాతః స్మరణీయులు

 సమాచారమ్-ఆంజనేయులు’ గారు

 

                  



ప్రపంచంలోకెల్లా అత్యంత

ఉన్నతమైనది అనగానే గుర్తుకు వచ్చేది ఏది?

ఎవరెస్టు పర్వతం?

ఆకాశం?

స్వర్గం? 

ఊహూ

మా నాన్న. 

అవును నాన్న మొదటి నుండి ఒక వ్యక్తి గా ఎప్పుడూ కనబడలేదు. నాన్న ఒక శక్తి. వ్యవస్థ లో నాన్నది ఓకొత్త ఒరవడి. నాన్నను జ్ఞాపకాలలోనో ప్రసంగాలలోనోవెతుక్కోవలసిన అవసరమే లేదు. తిన్నగా ఎందరి హృదయాలలోనో కొలువై వున్నారు. నిజం చెప్పాలంటే నాన్న జీవించినంత కాలం, తర్వాత కూడా నాకు దేవుడు అంటూ వేరే లేడు.

 

శ్రీరాముడిని పరిపూర్ణ వ్యక్తిగా చెప్పేందుకు పదహారు గుణాలను ఉటంకించారు వాల్మీకి. ప్రధమ భాషిట రాముడుతానే ముందుగా అందరినీ పలుకరించే వాడుట

మరినాన్నో?

భుజాల చుట్టూ చెయ్యి వేసి అనురాగాన్ని ప్రవహింప చేసేవాడు. ఎంతటి కొత్త వారిలో నైనా. రాజు-పేద వ్యత్యాసం ఆయనకు తెలియనే తెలియదు.

అందుకే రాజమండ్రికి కొత్తగా వచ్చిన ప్రతీ వ్యక్తి మా ఇంటి ఆతిథ్యం రుచి చూడాల్సిందే. పదవులు, అధికారాలు కన్నా మనిషిని మనిషిగా నే ముందు గుర్తింప చేసే వారు.  అందరూ గౌరవింప తగిన వారే అనేవారు.  


మా నాన్న అజాతశత్రువు అని చెరగని ఆయన చిరునవ్వే చెప్తుంది. చిత్రం! చైతన్యం లేదని వైద్యులన్నా మోముపై మాయని మందహాసమే అందుకు నిదర్శనం.

పనిలో చిన్న పెద్ద అంటూ తేడా ఉండదని మా కార్యాలయంలో పని ఎలాంటిదైనా కుటుంబ సభ్యులందరికీ తెలిసి ఉండాలనేవారు.

 

నిస్వార్ధత, నిరాడంబరతకు నిర్వచనం నాన్న. హవాయి చెప్పులతోను కాలి నడకనే నగరంలోని అన్ని కార్యక్రమాలకు ఓపిక ఉన్నంత కాలం హాజరయ్యేవారు. ప్రతి వ్యక్తి లోని ప్రతిభను గుర్తించడం, వెలికితీయడం అభినందించడం ఆయనకు నిత్యకృత్యం.

ఇంక ధైర్యం ఆయన రక్తం.  కళాశాల రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొనడం నుండి నగరంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఆయనే ముందుండి నడిపించే వారు.  అది కేవలం యుద్ధ రంగంలో ఉన్న సైనికుల సత్తా తోనే పోల్చతగినది. ఆంజనేయులు అన్న నామధేయం సార్థకమవటమే కాక ఆయన వల్ల పేరుకే శోభ కలిగింది.

పసిపిల్లల అన్నా పిల్లలకు పరుగు పందాలు పెట్టడం అన్నా ఎంతో సరదా నాన్నకు. ఈత, వ్యాయామం, యోగాభ్యాసం, మాస్టర్ సి.వి.వి ధ్యానం, ఫుట్బాల్ ఆట ఇలా ఎన్నో ఆయనకు అభిమాన విషయాలు. పుస్తకం చదవడం మొదలు పెడితే పూర్తి చేశాకే  పడుకునే వారు.

మేము పడుకునే సరికి ఇంకా ప్రూఫులు చూసుకుంటూ ఉండేవారు. లేచేసరికి రోజు కి వార్తలు వ్రాసేసి ఎంతో ఉత్సాహంగా ఊరిలోకి వార్తా సేకరణకు వెళ్లడానికి ఉద్యుక్తులవుతూ ఉండే వారు.

అలసట, నిద్రలేమి కాగడా వేసినా కనిపించేవి కావు.

అలా సమాచారం ఆయన ఊపిరి అయింది. మా ఇంటి పేరునీ ఆక్రమించుకుంది.

సూత్రంలా మమ్మల్నీ రాజమహేంద్రి తో కలిపి ఉంచుతోంది. "దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పవద్దని" నగరంలో ప్రతి ఒక్కరిని నిత్యం హెచ్చరిస్తోంది

మహాత్ముల హృదయం వజ్రసదృశం   మరియు కుసుమ కోమలం  కూడా అని అంటారు. అందుకే ఎవరి కష్టాలను విన్నా ఆయన చలించిపోయేవారు.. నాన్న సౌజన్యాన్ని రుచి చూడని వారు అరుదు. మంచు శిఖరం లా చల్లగా ఆహ్లాదాన్నిచ్చే అగ్ని శిఖ నాన్న. ఎన్నోజ్ఞాన జ్యోతులు జ్వాల నుంచే ప్రజ్వల స్ఫూర్తిని పొందాయి. 

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకుఅనురూపులు మా అన్నదమ్ములు.  ఆయన అడుగుజాడలో నడవడమే కాకుండా సమాచారం ప్రభను దేదీప్యం చేసి తాను అందులో ఐక్యం అయిపోయాడు  అన్నయ్య-సుబ్రహ్మణ్యం.  మిగతా కుటుంబ సభ్యులందరూ సమాచారంను, నాన్న అన్నయ్యలను ఆరాధించినంతగానూ అభిమానిస్తూ దాని మనుగడకై పాటుపడుతున్నారు

"తమ కోసం మాత్రమే తాము జీవించే వారు మరణించిన వారి కన్నా మేలేంకాదు" అన్నారు స్వామి  వివేకానంద. ఊరి కోసమే చివరి ఊపిరి వరకు మనుగడ సాగించిన   నాన్న మనందరిలోనూ జీవించే వున్నారు.

 

కుమార్తె

శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

(సమచారం వ్యవస్థాపకులు, సంపాదకులు కీ.శే. గంధం సీతారామాంజనేయులు గారి 95వ జయంతి సందర్భంగా...)

Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 2nd July 2015 


Comments

  1. Very well written... Attha 😊🙏

    ReplyDelete
  2. జయక్క, ఆలస్యంగా ఈ పోస్ట్ చూసినందుకు క్షమించమని కోరుతున్నా.
    నీ హృదయం నుంచి జాలువారిన ప్రతి అక్షరం సత్యం. పెద్దనాన్న అందరివాడు. పేరు ఆంజనేయులు అయినా శ్రీరామచంద్రుడులాంటి వారు అనడంలో అతిశయోక్తి లేదు. పద్మా అవార్డుకు నూరుశాతం అర్హులు.

    ReplyDelete

Post a Comment

Popular Posts