సోనాముఖి పురికేగుదమా! శ్రీ సుందరి తనయుని చూచెదమా!
You can Listen to this Article in the above Audio
సోనాముఖి పురికేగుదమా! శ్రీ సుందరి తనయుని చూచెదమా!
చాలా అందమైన బాల్యం నాది. నిరాడంబరులైన పెద్దలు, ప్రేమ స్వరూపులైన తోబుట్టువులు, కాలాన్ని మరిపించే స్నేహితులు. ఎంతో ఉత్సాహవంతమైన ఒడిదుడుకులు ఎరగని వైవాహిక జీవితమూ.
అరె! వచ్చేసిందే అని తెలియకుండా నన్నే ఆశ్చర్యపరుస్తూ, నాకు ఇష్టమైన పనులు ఏమైనా చేసుకోగల తీరికతో ఈ నడివయసు. అంతెందుకు అన్ని దశల్లోనూ అవధులులేని ఆనందం, సంతృప్తి నా చిరునామా. వీటన్నింటి వెనకాల ఉన్న ప్రత్యక్ష, అదృశ్యహస్తం నా హరనాధుడిది. నిజం, నేను భూమి మీద పడ్డప్పటినుండి నాకు బాబా ప్రేమ నిరవధికంగా అందుతూనే ఉంది.
అదే
నా ఊపిరి. రక్ష. నేను ఎప్పుడూ ఆయనకు మాత్రమే జవాబుదారిని. చిన్నతనంలో ఇంట్లో బాబా భజనలు ఏకాహాలు సప్తాహాలు హోరెత్తేవి. భజనలు చేయించే వాళ్ళ తన్మయత్వంలో చేతులు మండిపోయేలా తప్పట్లు కొడుతూ మమేకమై పోయేవాళ్ళం. ఇంట్లో ఎక్కువగా బాబా ఫోటోలే ఉండేవి.పేద్ద బాబా ఫోటో ఆయన హృదయంలో కుసుమమ్మ. వాటిని తలుచుకుంటేనే హృదయం తడిసి ముద్దవుతుంది. ఆయనా దేవుడు. ఫోటోలోనే ఉంటాడు. పూజ ఇలాగే చేయాలి అంటూ ఎప్పుడూ దూరంగా అనిపించ లేదు. మేము ఏది తినాలన్నా ముందు ఆయనకి నివేదించే తీసుకునేవాళ్ళం.
ఆయన కూడా మా కుటుంబంలో వ్యక్తి.
తాత, నాన్న, అన్న, అమ్మ ఇలా వీళ్ళతో ఉన్నట్లే చనువు. నిజం చెప్పాలంటే మనల్ని గారం చేసే వాళ్ల దగ్గర ఉండే అధికారం. బాబా ఇది కావాలి. ఇది ఇలాగే జరగాలి. ఏంటి బాబా నువ్వు నన్ను ఇలా అకస్మాత్తుగా వదిలేసావు. ఒకటా? రెండా? బాబాని నిలదీసిన అంతగా నేను ఎవరినీ నిలదీయలేను. దీనికంతటికీ కారణం మా మేనత్త కీర్తిశేషులు శ్రీమతి మైదవోలు వెంకట సరోజని గారు. ఆమె జీవితమే మాకు సత్యంగా ఉదాహరణగా ఆవిష్కరింపబడింది. బాబా మా ఇంట్లోనే ఉన్న అనుభూతి. అబద్ధం కాదని ప్రతిక్షణం నిరూపించబడుతూ వచ్చింది. బాబా నాతోటే ఉండడానికి నిదర్శనంగా కీర్తిశేషులు బాబూరావు గారు నా వివాహానికి బాబా అమ్మల ఫోటోలను బహుకరించారు. అంత అద్భుతమైన బహుమతి నేను ఎవ్వరి నుండి అందుకోలేదు. అలా బాబా అమ్మ నాకు తోడుగా నిలబడ్డారు.
బాబా గురించి నాకు తెలియనిది ఏదో ఉందని ఎప్పుడూ అనిపించలేదు. బాబా గురించి పెద్దగా చదవనూలేదు. మన అమ్మ, నాన్న ల చిన్నతనం
మనకు
తెలియదు. ఎవరైనా వారి గురించి మీ అమ్మ బావిలో ఈత కొట్టేది,
నాన్న
ఎన్నో మైళ్ళునడిచి కాలేజీకి వెళ్లే వాడు అంటుంటే చూడకపోయినా మదిలో పొంగిపొర్లే ఆనందం.
అలాగే
నా హరనాధుడి కుసుమమ్మల లీలలు వారి అనుభవాలు ఎవరైనా చెప్తుంటే ఎంతో ఆనందంతో పొంగి పోతాను. వాళ్ళు ఎప్పటికీ నా నుంచి వేరు కాదు.
బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్ లోని కుసుమహర
జ్యూయలర్స్ అన్న చిన్న బోర్డు నన్ను తట్టి లేపింది. అక్కడ కీర్తిశేషులు శ్రీ పోలిరెడ్డి గారి కలయిక ఆత్మనే స్పృశించింది. కుసుమమ్మకు 18 సంవత్సరాలు సేవ చేసిన మనీషి ఆయన. ఆయన దర్శనం నాకు బాబానే సాక్షాత్కరించిన అనుభూతిని ఇచ్చి ఆనందాశ్రువులు తెప్పించింది.
అది బాబాకు నాపై గల అనురాగానికి చిహ్నం. నేను వారిని
కలవటం
అప్పుడప్పుడు రాజరాజేశ్వరి నగర్ లోని కుసుమ హరనాథ ఆశ్రమం లో జరిగే బాబా పుట్టిన రోజు సప్తాహాలకు హాజరు కాగలగడం పూర్వజన్మ సుకృతం. ఇదే మా సోనాముఖి యాత్రకు నాందీ ప్రస్తావన.
స్వర్ణముఖి అమ్మ వెలసిన ప్రాంతం సోనాముఖి అయింది. కుసుమ హరనాథుల ఆవిర్భావానికి రంగస్థలం కాగలిగింది. మా కుటుంబ సభ్యులందరి కన్నా ముందుగా మా వారు శ్రీ చన్నాప్రగడ చంద్రశేఖర్ 2007లోనే సోనాముఖి వెళ్లారు. బాబా, ముందు అల్లుడిని అనుగ్రహించారు. బాబా ఒళ్ళో పెరిగింది మేము. ఈయన
ఎంత
అదృష్టవంతులు? మేము ఎప్పటికీ వెళ్లగలం అని అనుకునేదాన్ని. బాబా 150 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏటా జరిగే దసరాలకు వెళ్ళమని మా వారే తొందర పెట్టారు.
మా పెద్ద వదిన శ్రీమతి గంధం రాజ రాజేశ్వరి, అక్క శ్రీమతి ఆనందరావు నాగ సుభద్ర, బావగారు శ్రీ ఆనందరావు శ్రీనివాస్ గారు, అన్నయ్య శ్రీ నల్లగొండ రవి ప్రకాష్, వదిన శ్రీమతి విజయ సావిత్రి అంతా కలిసి ఎంతో
ఉత్సాహంగా పశ్చిమబెంగాల్ కు పయనమయ్యాం. తోబుట్టువులతో కలిసి మొదటిసారి చేసిన యాత్ర. మాటలకందని సంతోషం. నా బాబా పుట్టిన ఊరు, నడిచిన ఊరు చూడబోతున్నా అని. ముందుగా కలకత్తా కాళిని, బేలూర్ రామకృష్ణ మఠాన్నీ,స్ఫూర్తిప్రదాత వివేకానందుడినీ రవీంద్రుడి శాంతినికేతనాన్నీ చూసుకుని అక్టోబర్ 15
2015 రాత్రికి సోనాముఖి చేరుకున్నాం.
హరనాథుని ఆశ్రమం అల్లంత దూరంలో ఉండగానే జంట గోపురాలు, స్వాగత ద్వారాలు కనిపిస్తాయి. ఒక ద్వారం మందిరంలోకి దారి చూపిస్తే, మరొకటి ఆశ్రమానికి తీసుకు వెళుతుంది. ఆ రెండిటి నడుమ బాబా మనవడు తులసీదాస్ బెనర్జీ దంపతుల సమాధులు, మందిరం వెనుక బాబా స్వయంగా తెప్పించిన అమృత జలధార, అతి సుందరమైన అనంత
కుండ్. నాలుగు పక్కలనుండి కొలను లోకి దిగే అవకాశం, కొలను దగ్గర చిన్న శివలింగం. ఒడ్డున శ్రీ పోలిరెడ్డి గారి సమాధి, వసతిగృహాలు, ఎంత మంది యాత్రికులు వచ్చినా ఆకలి తీర్చే విశాలమైన భోజనశాల. ఇదీ స్థూలంగా ఆశ్రమం.
నిర్వాహకులు శ్రీ హర కిషన్ గారు మాకు సోనాముఖీ చేరుకోవడానికి సలహా, సూచనలతో పాటు వాహనం వసతి కూడా కల్పించారు.
ఆ నిశీధి వేళ.... చక్కటి కొలనుమీద నుండి వచ్చే ఆహ్లాదకరమైన చల్లని గాలి, నక్షత్రాలను నేలపై చిలకరించినట్టుగా దేదీప్యమైన దీప కాంతులతోవెలిగిపోతూ అందమైన గోపురాలు, అఖండ నామస్మరణ పరిమళాలు నింపుకున్న సమీరాలు ముప్పిరి గొలుపుతూ మమ్మల్ని స్పృశించాయి. గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని మందిరం వైపు పరుగులు తీసాం. ఏళ్ళ తరబడిన నిరీక్షణతో కూడిన ఉత్కంఠ. అద్భుతం ఆనాటి బాబా దర్శనం. మందిరంలోకి ప్రవేశించగానే ముందుగా ఎడమ పక్కన బాబా సమాధి. కుడి పక్కన అమ్మది. ఆ మధ్యన నిలువెత్తు ఆ యుగళ ప్రేమమూర్తులు మనల్ని ఆశీర్వదిస్తూ కొలువై ఉంటారు. బాబా ఓ లేఖలో అంటారు... ఏమిటీ ఈ ఇంద్రజాలం? నా చేయి వేస్తే రుగ్మతలు మాయం అంటున్నారు అని. మా యాత్రా ఆయన ఖేళే. దానికి ఉత్ప్రేరక మైన వాళ్ళు కొంతమంది ఉన్నా, వారూ ఆ లీలలో భాగస్వాములే
ఎప్పుడూ సంతోషంగా ఏ కొరతా లేనటువంటి నాకు, ఆకలే లేని నాకు ఆయన అమృతాన్ని తాగించారు. ఇంకేముంది కళ్ళతో రూపామృతాన్ని, చెవులతో నామామృతాన్ని గ్రహించి నా జ్ఞానేంద్రియాలు సార్థకమయ్యాయి. అక్కడ అప్పటి గాలిలో, నీటిలో, మనుషుల్లో భోజనంలో ఎక్కడ చూసినా బాబా ప్రేమే. గుండె తట్టుకోలేక కళ్ళల్లోంచి ప్రవహించసాగింది. ఏమి రుణం ఇది! ఎంతటి కరుణ బాబాకు నామీద.!
మొర్నాటి ఉదయాన్నే అనంతకుండ్ లో స్నానం మా శరీరాల్ని పునీతం చేసింది. బాబా అమ్మల జన్మస్థలాలు,
బాబా పడుకున్న మంచం, గది, బట్టలు, బాబా లేఖలు, రాసుకున్న బల్ల, ఇలా ప్రతిదీ ఎంతో అబ్బురంగా, అపురూపంగా తడిమి చూశాం. ప్రతీచోటా బాబా రక్తసంబంధీకులు అంతా అత్యంత ఆత్మీయ ఆదరణతో స్వాగతించారు. తప్పిపోయి చాలారోజులకి కలిసిన భావన. ఇంకా గౌరాంగుని గంటల గుడీ,
బాబా తండ్రి జయరాం
బందోపాధ్యాయ నిర్మించిన శివాలయం, స్వర్ణముఖి అమ్మవారిని దర్శించుకున్నాం.
ఎన్నో ప్రాంతాలనుండి దేశ వ్యాప్తంగా వచ్చిన బాబా భక్తులను కలుసుకోగలిగాం.
ఇండియా
లోనే స్థిరపడిపోయిన రూత్ బార్ అనే జర్మనీ భక్తురాలు పరిచయం నాకు బెంగళూరులోనే లభించింది. ఆమె గురించి తెలుసుకున్నాక దైవమైన గురువుని మనం ఎన్నుకోలేము. వారిచే ఎన్నుకోబడతాము అని అర్థమైంది. నా భక్తులు నా పిల్లల కంటే అతి ప్రేమాస్పదులు.
అంటూ
"మీరే నా ఆనందానికి మూలకందాలు"
మిమ్మల్ని చేజార్చుకుందటే నాకు ఏది రక్షణ? దిక్కు? అనే ప్రేమ మూర్తి ఎక్కడ దొరుకుతారు మనకి? నిజంగా ఆయన పాగల్ హరనాథుడే. నా ప్రభువు ఔదార్యానికి హృదయం కరిగి
నీరయింది ప్రేమతో ఆయనను బందీ చేసుకున్న ఆ భక్తుల పాద ధూళితో ఆపాదమస్తకం తిరిగి జన్మించిన అనుభూతి.
ఇక మూడో రోజు పొద్దున్నే నామ నగర సంకీర్తనతో ఆడుతూ పాడుతూ
గెంతులు
వేస్తూ పూర్తిగా పాల్గొనే అదృష్టాన్ని ప్రభువు నాకు ప్రసాదించారు. మావారు శ్రీ చన్నాప్రగడ
చంద్రశేఖర్ కూడా మా బృందానికి జతగా కలిశారు. యాత్ర సఫలమైన తార్కాణంగా ఎన్నో వింతలు, అనుభవాలు. ముందుగా ప్రణాళిక ప్రకారం వెళ్ళలేకపోయినా, ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎంతో సుఖంగా సంతోషంగా సాగింది మా సోనాముఖి పర్యటన.
పుట్టింటికి సేద తీరడానికి వచ్చిన ఆడపిల్లని చూసుకున్నంత అపురూపంగా వేళకు అన్నీ అమర్చారు బెంగళూరు వాసి అయిన శ్రీ హర కిషన్ వారి కుటుంబ సభ్యులు. శ్రీకృష్ణుని భక్తుడైన గౌరంగ ప్రభువే హరనాథుడిగా అవతరించారు. ప్రేమ అన్న భావానికి ఆకృతినిస్తే ఏర్పడినదే హరనాథుని రూపం. గృహస్థుగా వచ్చి మన హృదయాలకు మరింత చేరువయ్యాడు. కలికాలంలో సులభంగా మోక్షమిచ్చే సాధనం నామస్మరణ మాత్రమే అని పురాణాలు చెబుతున్నాయి. మరి హరనాధుని మాటల్లో దీని గురించి ఆయన ఏమన్నారో చూద్దాం.
నామమనే నీటిలోనే ఎప్పుడూ ఉండండి. మురికి మీ ఛాయలకు రాలేదు
ఈ ప్రపంచంలో అపవిత్రమైన దంటూ ఏదీ లేదు ఒకవేళ ఉన్నా ప్రభువు నామ స్పర్శతో అది అత్యంత పవిత్రమైనదిగా భాసిస్తుంది.
ప్రభుని నామస్మరణం చేస్తున్న నీకు ఆయన విడిచిపెడతారు అన్న భయం దేనికి? ఇలా చెబుతూ మనకు మార్గోపదేశం చేస్తున్నారు హరనాథుడు.
హరనాథుని వాక్యాలు అన్నీ వేద వాక్యాలే నాకు.
ఎల్లప్పుడూ చిరునవ్వుతో మెలగడం నేర్చుకో. ఇతరులను కూడా నవ్వేటట్టుగా చెయ్యి. అలాగైతే దుఃఖభూయిష్టమైన ఈ ప్రపంచంలో నీవున్న కాలం అంతా ఆనందంగా గడప గలుగుతావు.
అసలే ఈ ప్రపంచం ఆనంద రహితంగా ఉంది. కావాలని ఆ బాధను ఇంకా పెంచుకుంటా వెందుకు? ఇప్పటికే కటిక చీకటిగా ఉంది. కళ్లు మూసుకుని ఆ అంధకారాన్ని తీవ్రతరం చేసుకుంటావ్ ఎందుకు?
నిరతానందం నిత్య సఖిగా
ఉండాలంటే మాట్లాడే ముందు మాటలను చేయబోయే ముందు పనులను ఆచితూచి బేరీజు వేసుకోమ న్నాడు.
మనం ఎంతో అదృష్టవంతులం అందుకే ఇటువంటి ప్రభువు చేతిలో పనిముట్లు కాగలిగాం. ఆయనను పొందటమే మన జీవితానికి ఏకైక లక్ష్యమై ఉండాలి. అదే మనకు హరనాథుని ఆదేశం. అదే దిశగా మన పయనం సాగించమని ప్రభువుని వేడుకుందాం.
జై బోలోపాగల్ శ్రీహరనాధప్రభువుకీ జై
మాతా కుసుమ దేవి కీ జై.
శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి
Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 1st July 2016







హరనాథుని తత్త్వాన్ని అర్థం కాదు అన్న మాట తప్పు. కసుమహరనాథుల జీవన ప్రస్థానంలో చెప్పిన విషయాలన్నీ హృదయంలో పొందికగా పేర్చుకొని వాటిని ఆచరణ చేస్తున్న నీవు ధన్యత పొందావు. మంచి మనసు వున్న వారికి మంచే జరుగుతుంది. నీకు సంపూర్ణ కరుణ కటాక్షాలు నీ ఇష్టం దైవం ప్రసాదించాలని కోరుకుంటూ....
ReplyDelete🙏
Delete❤
ReplyDelete