దివ్య మానసమ్ (Part-3)
You can Listen to this Article in the above Audio
దివ్య మానసమ్
(Part-3)
శివ సంకల్ప సూక్తమ్
మంత్రం : 2
యేన కర్మాణ్యపసో
మనీషిణో
యజ్ఞే కృణ్వంతి
విదథేషు ధీరాః
యదపూర్వం యక్షమంతః
ప్రజానాం
తన్మే మనః శివసంకల్పమస్తు
ఈ రెండవ మంత్రం మన మనస్సు ఏ
ఉన్నతమైన పనులను నిర్వర్తించటానికి ప్రత్యేకతను కలిగి ఉందో దానిని ప్రశంసిస్తూ చెప్పబడినది.
తెలివైన వారు, పండితులు దేని చేత యజ్ఞ యాగాదులనే కర్మకాండలను సక్రమంగా నిర్వర్తిస్తూ
వుంటారో, ఏదైతే పూజింపతగినదో, ప్రతీ జీవిలోనూ
ఒక ప్రత్యేకతతో కూడి వుంటుందో, అటువంటి మనస్సు శుభ సంకల్పాలను కలిగి ఉండును గాక అని
దానర్థం.
మనం కర్మబద్దులం కర్మలు చేస్తున్న
కొద్దీ కోరికలు పెరుగుతాయి. ఏదైనా పని చేయాలంటే దానికి తగిన జ్ఞానం, తగినంత సమయం, వెచ్చించాల్సిన
శక్తి, భౌతిక వనరులు అవసరం. దాని పర్యవసానం
ఏ విధంగా ఉంటుందో తెలుసుకొనివుండాలి. చాలా
మంది అందోళనతో, తొందరపాటుతనంతో కార్యాలను నిర్వర్తిస్తూ వుంటారు. గాలివాటుగా చేసి కర్మ
బద్ధులవటం కాకుండా పూర్తి జాగురూకతతో, అవగాహనతో కార్యాలను సలపాలి.
కొంతమంది ఎప్పుడూ పని చెయ్యక
బద్ధకంతో వుంటారు. మరికొంతమంది తమ విధులను మరచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వుంటారు.
సగం శ్రద్ధతో చేయటం, లేదా వాయిదాలు వేయటం, ఇంకా కొంతమంది రిక్తహస్తాలతో అనుచిత కార్యాలను
చేస్తుంటారు. మరికొంతమంది ఆలోచనా రహితంగా కార్యాలను చేస్తుంటే మరికొందరు కార్యశూన్యులు కేవలం అలోచిస్తూ గడుపుతారు. తమ మనస్సు
ఎటు తీసుకు పోతే అటు విహారం చేస్తుంటారు. మనస్సు మనలను తన
ఊహలతో, భావోద్రేకాలతో, విలాసాల పట్ల కోరికతో, పాత జ్ఞాపకాలతో, అలవాట్లతో, సంఘర్షణలతో
ఇలా వివిధ అంశాలపై తిప్పితిప్పి అలసిపోయేలా చేస్తుంది.
ఆలోచన చేయగలిగినా కూడా వివేకము
లేకపోయినా, మనస్సు మీద అదుపులేకపోయినా, అన్నీ వుండీ కర్మను చేయటానికి ఉత్సుకత లేకపోయినా
వృధా. కొంతమంది సలహాలు మాత్రం ఇస్తారు. వారు వేయలేరు.
అపస్వినులు అంటే
కార్యతశీలురు. తగిన నిధులు, విధులు పద్ధతి తెలిసి వుంటారు. అకుంఠిత దీక్ష కలిగిన వారు.
అందుకే అనుకున్నది సాధిస్తారు పూజ్యస్వామి చిన్మయానందగారు
అన్నట్లు "మీ పనికి ప్రణాళిక వేసుకోండి. ప్రణాళిక
ప్రకారం పనిచేయండి" అని.
స్థిర నిశ్చయంతో
కూడి, స్వతంత్రతతో ఆలోచించే శక్తి కలిగిన, వ్యక్తీకరించబడిన మనస్సు కలవాడినే మనీషి
అంటారు. ధీరులు అంటే సమదుఃఖ సుఖీ కష్టాలకు చలించనివాడు, విషమ పరిస్థితిలోనూ చిరునవ్వుని
కోల్పోనివాడు, సమస్థితిలోనే ఎల్లప్పుడూ వుండేవాడు
జీవితపు రోడ్డు శ్రేయస్సు ప్రేయస్సు అనే
రెండు మార్గాలుగా విడిపోయినప్పుడు మన విజ్ఞత తెలుస్తుంది. మనకు శ్రేయస్కరమైనది. ప్రియమైతే
సమస్యే లేదు. మనం ఎప్పుడూ నిత్య దైనందిన కార్యక్రమాలలో మనకు నచ్చిన వాటిలో నిండిపోయి
వుంటాం. కానీ మనకు శ్రేయస్కరమైన దాన్ని గురించి ఆలోచించం. ధీరపురుషుడు ప్రియమైనది ఏది?
శ్రేయస్కరమైనది ఏది? దాని వ్యత్యాసాన్ని గుర్తించగలిగిన వివేకి. వస్తువుల మీద నుండి తన దృష్టిని విషయానికి తిప్పకలిగినవాడు. ఆకర్షణల నుండి తనను మరల్చుకోగలిగి తట్టుకోగలిగినవాడు.
అటువంటి గొప్పవారి మనస్సు ఏ
విధంగా వుంటుందో ఊహించగలరా? అటువంటి వారు కర్మచేస్తే
అది ఒక యజ్ఞంలా భావించి చేస్తారు. మీరు పరిగ్రహిస్తున్న
దానికి అధికంగా, అనుభవిస్తున్న దానికన్నా మిన్నగా ఉత్పత్తి చేయటాన్నే యజ్ఞకర్మలు అంటారు.
అందరి మంచి కోసం బేషరతుగా నిర్వహించే కర్తవ్యాలు ఉన్నత కార్యాలుగా చెప్పబడతాయి. స్వార్ధం
అహంకారాలకు తావు లేకుండా ప్రేమతోనూ, దృఢ సంకల్పంతో చేసే కార్యాలకు భగవంతుని ఆశీస్సులు
ఎప్పుడూ ఉంటాయి. అటువంటి కార్యాలలో పాల్గొనే వారికి ఉన్నతి ప్రగతి వుంటుంది. నిస్వార్థమైన
అటువంటి కార్యాల వల్ల ఈ ప్రకృతి సమతౌల్యం పరిరక్షింపబడుతుంది, సూర్యుడు ఎంపిక చేసుకోకుండా
ఏ విధంగా తన కిరణాలను అన్నిటి మీదా ప్రసరిస్తాడో, చెట్లు ఏ విధంగా పండ్లను శ్రమలేకుండా
ప్రసాదిస్తాయో ఇందుకు ఉదాహరణ. యజ్ఞం అంటే దైవ ఆరాధన మరియు
త్యాగ భావన. కర్తృత్వ భావన కలిగి వున్న భావనను విడిచిచేయాలి. స్వార్థం లేకపోవడమే యజ్ఞం తెలివైన వారు తమ
మనస్సును అధీనంలోనికి తెచ్చుకుంటారు. వాళ్ళ విధులను అలసించక, సక్రమంగా నిర్వహిస్తూ,
ఆధ్యాత్మిక సాధనలను పాటిస్తూ, నిర్లిప్తతతో, జాగురూకతతో జీవిస్తూ నిత్యం శ్రమిస్తూ
వుంటారు.
ఇక్కడ మనం చేసుకోవాల్సిన
సంకల్పాలు ఈ విధంగా ఉంటాయి
1. నేను కూడా ఉత్సాహంగా క్రియాశీలతతో, నియంత్రించబడిన మనస్సు కలవాడనై ఉన్నతమైన కార్యకలాపాలను నిర్వహిస్తూ వుండెదను.
2. ఎన్నో అపూర్వమైన ప్రత్యేకతలు కలిగిన మనస్సు ఎప్పుడూ సద్భావనములతో నిండివుండుగాక! భగవంతునిచే ప్రసాదింపబడిన ఈ అపురూప అద్భుతమైన బహుమతిని నేను సరిగా వినియోగించుకుందును గాక!
ఎప్పుడైతే నిజంగా ఆరాధించతగిన భగవంతుడిని ఆరాధిస్తూ వుంటుందో ఆ మనసు కూడా ఆరాధించతగినదిగా మారిపోతుంది. భగవంతునికీ, భక్తునికీ వ్యత్యాసం లేనట్లు అక్కడ ధ్యానించతగినది. ధ్యానించేది అంటూ వేరు వేరుగా ఉండవు.
3. నా మనస్సు కూడా భగవంతుడిని ఆరాధిస్తూ ఆరాధించతగినట్లుగా సుందరంగా ప్రకాశవంతంగా మారుగాక!
4. నాలో వున్న మనస్సు ఉన్నత కార్యాల పట్ల ప్రేరణ కలిగించు గాక! పూర్ణ చైతన్యం నా మనస్సుని ఆశీర్వదించి సరియైన త్రోవ చూపుగాక! మంగళకరమైన భావాలతో నింపి ఉంచుగాక! నాలో వున్న శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోవడానికి మనస్సు ప్రయత్నించుగాక!
5. ఎల్లప్పుడూ విద్వాంసులు వివిధ యజ్ఞయాగాది మూలక హవిస్సులు ఏ భగవంతునికి సమర్పిస్తున్నారో, ఎల్ల ప్రాణులందు అంతర్యామిగ వున్న భగవంతుని కృపతో నా మనస్సు నందు శుభసంకల్పాలు కలుగుగాక!
6. మనీషిణులు, ధీరులు కలిగినటువంటి లక్షణాలను నా మనస్సు కూడా కలిగి ఉండి వారు ఏ విధంగా యజ్ఞ భావనతో కర్మలు ఆచరిస్తారో అదేవిధంగా ఆచరించు గాక!
శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి
Published by G.S.R Impressions RAJAMAHENDRI Dated 1st March 2017



Comments
Post a Comment