నేను-నా ఉనికి

 You can Listen to this Kavitha in the above Audio



నేను-నా ఉనికి

 

నేను వాగుడు కాయని

మాటల పోగుని

నడిచే రేడియోని

అది నా ఐదో ఏటి మాట

 

పదాల్లో స్పష్టత, ఠకీమని

ఆలోచించక్కర్లేకుండా

మాటకు మాట అన్నా

ఆనాడు అదే ముచ్చట.

 

నేను నాన్న కూచిని

 "నీ పని నాన్నకు చెప్తా"

ఆటంబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం

మా ఇంట నాకే సొంతం.

తోబుట్టువుల ఆప్యాయతలు

గిల్లికజ్జాలతో పెరిగిన

బాల్యమనే ఆస్తికి వారసురాల్ని.

 

నేను ఒక ప్రియమైన నేస్తాన్ని

అరమరికలు లేని

స్నేహితుల చేతిని

ఎప్పటికీ విడువలేని

స్నేహ చకోరాన్ని.

 దేవుడే ప్రత్యక్షమై రమ్మన్నా

అందరం కడవరకు విడిపోమనుకునే

అమాయకురాలిని.

 

నేను పుస్తకాల పురుగుని

కథల పుస్తకమైనా   పురాణమైనా

కామర్స్- లా సబ్జెక్ట్ ఏదైనా

మొదలు పెడితే ముగించేదాకా

నిద్ర ధ్యాసే లేని దాన్ని.

 

నేను సాహసాభిలాషిణిని

పర్వతారోహణమైనా,

ఆధ్యాత్మిక ఆవాసమైన,

యోగాభ్యాస ప్రదర్శన అయినా

కొత్తది నేర్చుకోవటం లో

వెఱపు లేని దాన్ని

అన్నింటా ఆసక్తి కలదాన్ని.

 

నేను నిత్యసంతోషిణిని

గుండెల నిండా భక్తితో ఎప్పుడూ

నాతోనే ఉండే

బాబా అండతో

పెదాలపై చెఱగని చిరునవ్వుతో.

 

నేను నిత్య లేఖాభిలాషిణిని

ఉత్తరం అందుకోవటమో

రాసి డబ్బాలో వేయటమో

పోస్ట్మాన్ కి పాపులర్

అయిన దాన్ని

  

నేను ప్రేమ పిపాసిని ని

లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్

అన్నమాటకు పరవశనై

జీవితాన్నే పళ్ళెంలో పెట్టి నివేదించిన దాన్ని.

 

నేను ఓపొడుగు జడ

పొట్టి(గట్టి) ప్లీడర్ ని

కోర్టుకు వెళ్ళినన్నాళ్లూ

కాలాన్ని స్కూటీతో

పరుగులు పెట్టించిన దాన్ని.

 

నేను అలుపెరుగని గృహిణి ని

అన్నిటా అంతా తానే అయిన

పతిదేవుని కనుసన్నలలో

మెలిగిన అలివేణి ని.

 

నేను అనురాగాన్ని మాత్రమే

పంచాలనుకునే

అచ్చమైన అమ్మని

బంగారు బిడ్డల భవిష్యత్తు కన్నా

ఏదీ ముఖ్యం కాదు అనుకునే సగటు తల్లిని.

 

వయసు మాటల్ని మింగేస్తుందా?

మౌనాన్ని ఆశ్రయించి

గంభీరి నయిన వాగుడు కాయని

 

కాలం ఇచ్చే ప్రమోషన్స్ తో

గారాబుపట్టీలకు గార్డియన్ అయిన నాన్న కూచిని.

 

భవసాగరంలో అలు పెరుగక

ఈదుతున్న బంధు,మిత్రుల ఇక్కట్ల పురాణాలకు

శ్రోతనై, వక్తనై, జత ఈతగత్తెనై

అజ్ఞాతవాసంలో ఉండిపోయిన పుస్తక ప్రేమిని.

 

సాహసాలను జీవిత పోరాటాలకే

పరిమితి చేసి పిల్లల సంఘర్షణలకు

సర్ది చెప్పగలిగే ధైర్యశాలిని

 

కాలం తీసుకుపోయిన మనుషులు

మనసుని ఖాళీ చేస్తే

వయసు ఒంటిమీద చేసే. మార్పుల స్వారీలో

పర్వతాల మాట ఎలా ఉన్నా

పది అడుగులకే పాదాలు మొరాయిస్తే

 

చెట్టు మీదకెక్కిన

లాయర్ తనం

చిక్కి శల్యమైన

కేశ సౌందర్యం.

అద్దంలో కనిపించే పరాయితనం

ఫక్కున నవ్వి అదీ ఇదీ

అన్నీ నువ్వే అంటున్న

జోడు వెనకాల కళ్ళ కొంటెతనం.

 

ఇంతకీ" నా " ఉనికి ఎక్కడ?

మాటలోనా?

మౌనంలోనా?

ఉత్సాహంలోనా?

వైరాగ్యం లోనా

 

బాహ్య దృష్టికి

మారిన ఆకారానికి …. వ్యవహారానికీ

నాకూ ఎలాంటి సంబంధం లేదు.

 

నిజం.

నేను

ఎప్పటికీ చిన్నప్పటి వాగుడికాయని

నాన్న కూచిని

బాబాకు ప్రియమైన దానిని కుటుంబంలో చిరునవ్వుని

 

ఇదే మారని సత్యం

అదే గుండెలో నిరంతరం వెలిగే 

ఆత్మజ్యోతి నా ఉనికి.🙏🏻

 

జయలక్ష్మి చన్నాప్రగడ

బెంగుళూరు

Dated 28th March 2019

Comments

  1. దీర్ఘకవితలు చదివి చాలా రోజులైంది. అన్నీ కళ్ళు ముందు కదిలిన సంఘటనలు, కొన్ని అనుభవాలు, జ్ఞాపకాలు భారంగా అనిపిస్తాయి. చక్కగా ఆవిష్కరించావు.

    ReplyDelete
  2. ఎంతో అద్భుతంగా కవితను ఆవిష్కరించావు జయక్క. నీ నోట పలికిన ముత్యాలాంటి మాటలు సత్య పలుకులుగా భావిస్తున్నా. పదాల పొందిక చాలా బాగుంది. నీ జడ పొడుగులాగే.. నీ మనసు ఎంతో గొప్పది. 💐💐

    ReplyDelete

Post a Comment

Popular Posts