వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్ వస్తున్నాయ్

 

వస్తున్నాయ్ వస్తున్నాయ్ 

జగన్నాథ రథచక్రాలు 

వస్తున్నాయ్ వస్తున్నాయ్ 

(ఈరోజు ఆషాఢ శుక్ల విదియ పూరి జగన్నాథుని  రథయాత్ర సందర్భంగా మా పూరి యాత్ర (జనవరి 19 నుండి 25 వరకు) విశేషాలు). 

జగన్నాధుని రథచక్రాలు వస్తున్నాయ్ అంటూ శ్రీశ్రీ గారు జగన్నాధుని చిన్నతనంలోనే పరిచయం చేసారు. అప్పుడే అర్థమైంది జగన్నాథుడు నిజంగా సామాన్య జనులకు అందుబాటులో ఉండే ఆరాధ్యుడు అని. అక్కడ నారాయణడు నరుల లాగే అన్ని అవస్థలను అనుభవిస్తూ పితృ కర్మలను కూడా ఆచరిస్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. అందుకే ఒరిస్సా ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా ఆయన కుటుంబ సభ్యుడు. స్వామి దర్శనం కేవలం ధర్మ దర్శనము మాత్రమే అందరకూ.

పూరి క్షేత్ర ప్రస్తావన కృతయుగంలోనే ఆరంభమైంది కృష్ణుడుగా అవతారం తీసుకోకమునుపే స్వామి, సంకర్షణడు, యోగమయ ఆది నుంచి ఈ క్షేత్రంలో సూక్ష్మంగా ఉన్నారుట. రామాయణం ఉత్తరకాండ లోను, భాగవత ద్వాదశ ఖండం లోనూ పూరి ప్రస్థావన ప్రస్ఫుటంగా ఉంది.

జగన్నాథుని ఆవిర్భావం వెనుక అత్యద్భుతమైన చరిత్ర ఉంది. భగవంతుడుని సశరీరంగా ప్రత్యక్షంగా అందరూ దర్శించుకునే ఆలయ నిర్మాణం చేయాలన్నది ఇంద్రద్యుమ్న మహారాజు కోరిక. నారాయణుడు నీలమాధవుడిగా రాజుకు స్వప్న దర్శనమిచ్చి అనుగ్రహించిన విధంనీలమాధవుని అన్వేషణలో సఫలీకృతుడైన ఆయన మంత్రి విద్యాపతి, ఇవన్నీ మనకు ఒళ్ళు గగుర్పాటు కలిగించేలా ఉంటాయి. పూరీకి సంబంధించిన ప్రతి అంశమూ ఒక గాధతో ముడిపడి ఉంటుంది.

నీలాద్రి, నీలాచలం అని చెప్పబడే, శంఖాకృతిలో వుండే పూరి క్షేత్రం 11 ఎకరాల విస్తీర్ణంలో వెలిసింది‌. జన్మలో ఒకసారైనా దర్శించి తరించాల్సిన చార్ధామ్ లలో ఒకటి పూరీక్షేత్రం.  ఒరిస్సా విలక్షణమైన సంస్కృతి కలది. వారు సంప్రదాయానికి  పెద్ద పీ వేస్తారుపూరీలో ముందుగా లోకనాథుడిని చూసాకనే జగన్నాధుని చూడాలనే నియమం ఉంది. లోకనాథుడైన ఈశ్వరుని దర్శనం శివరాత్రి ముందు ఏకాదశినాడు మాత్రమే లభ్యం. మేము గుడి లోపలికి వెళ్ళి మిగతా ఉపాలయాలను స్వామివారి ఉత్సవ మూర్తిని దర్శించుకుని జగన్నాథని దర్శనానికి వెళ్ళాము.

పూరి గుడికి నాలుగు పక్కలా నాలుగు ప్రధాన ద్వారాలు. అవి వరుసగా సింహ, అశ్వ, వ్యాఘ్ర, గజ ద్వారాలు. ఈ మధ్యనే ప్రజలను అన్ని ద్వారాలు నుండి అనుమతిస్తున్నట్లు తెలిసింది. సింహద్వారానికి ముందు కోణార్కపై దాడుల నుండి కాపాడి తెచ్చుకున్న 25.2 అడుగుల అరుణ స్తంభం, దానిపై కొలువున్న సూర్య రథసారథి అనూరుడు. ఆ స్థలం వద్ద దీపాలు వెలిగించుకుని గుడి ముందుకు చేరగానే బయటకే దర్శనమిచ్చే పతిత పావన జనార్ధనుడు.  సాంబ్రాణి పచ్చ కర్పూరంతో చేయబడిన ఆ జనార్ధనుడు  గుడిలోనికి అనుమతి లేని వారి కోసం గుడిలోనికి వెళ్ళలేని సందర్భాల్లోనూ బయటనుంచే దర్శించుకోవటానికి వెలిసారు. అదీ మతం మార్చుకోవడం వలన రాలేకపోయిన ఒక భక్తుని కోసం కరుణతో.


పతిత పావన జనార్ధనుడు, అరుణ స్తంభం

బాయిసీ పహాచ గుడి లోపలకి మనల్ని తీసుకువెళ్లే 22 మెట్లు. యమదండం అనీ పితృశిల అనీ, మెట్లపై వెలసిన కాశీ విశ్వేశ్వరుడు, ఆంజనేయుడు, ఇలా మెట్టు మెట్టుకో విశిష్టత.

అంతేకాదు పూరీక్షేత్రాన్ని అల్లుకుని ఉన్న ప్రతి అంశానికి ఒక చక్కటి గాధ వుంటుంది. అధ్యయనం తర్వాత ఆధ్యాత్మిక యాత్రకు వెళితే మనం పొందే సంతృప్తి మరింత అధికంగా ఉంటుంది.

గుడి నాలుగు పక్కల ప్రాంగణాలను రక్షించే నలుగురు ఆంజనేయులు గుడి లోపల కొలువైన నవ నారసింహులు ఊర్మిళా దేవి అంశ ఆయిన విమలాదేవి, మహాలక్ష్మి ఆలయం, కోణార్క్ నుండి భద్రంగా తెచ్చుకున్న సూర్యనారాయణమూర్తి, ఇంకా ఎన్నో ఉపాలయాలు

గర్భగుడిలోని జగన్నాథుని మనం స్పర్శించలేమని వటవృక్షం కింద వట పతిత పావనుడు ఆదరంతో మనలను అనుగ్రహిస్తాడు. మనం తనివితీరా భగవంతుని ఆలింగనం చేసుకుని ఆనందించవచ్చు.

ప్రపంచంలో ఉన్న నాలుగు వటవృక్షాల్లో పూరీలో ఉన్నది కల్ప వృక్ష వటం. (గయలో అక్షయవటం ప్రయాగలో పంచవటం శ్రీలంకలో  నికుంబిలవటం  వున్నాయి

తూర్పున ప్రధానమైనది  సింహద్వారం. దక్షిణాన అశ్వ ద్వారం వద్ద గుర్రాలపై బలరామకృష్ణులు ఉంటారు. పశ్చిమ ద్వారమైన వ్యాఘ్ర ద్వారం వద్ద కొద్దిసేపు కూర్చొని ప్రార్థించుకుంటే మనకు చార్ధామ్ లో మిగతా క్షేత్రాలైన ద్వారక, బదరి, రామేశ్వరం కూడా వెళ్ళిన ఫలితం వస్తుందిట. ఎంతోమంది సిద్ధులు, అఘోరాలు, అక్కడ నుండి సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తారుటఇంక ఉత్తర ద్వారం గజద్వారం.

మూలవిరాట్టులు చెక్కతో తయారు చేయబడి ఉండటం చెట్టు చెక్క విగ్రహానికి ఉపయోగించాలో కలలో తెలుపబడటం, మనం కలలో కూడా ఊహించని విషయాలు. గర్భాలయంలో ప్రవేశించే ముందు విగ్రహమూర్తుల రూపం విశిష్టతను తెలుసుకుందాం. 

ప్రజలందరినీ రెప్ప వేయక అవిరామంగా కృపాదృష్టితో పాలించాలని ప్రభువు కళ్ళకు రెప్పలు ఉండవు. బలబద్ర సుభద్ర జగన్నాధ విగ్రహాలకు కాళ్లు ఉండవు. చేతులు సగమే ఉంటాయి. విగ్రహాల తయారీ మధ్యలో కలిగిన అంతరాయం వలన పూర్తి కాబడక అలా ఉండిపోయాయి. కానీ పరమాత్మ ఉద్దేశం, అంతరార్థం వలన మాత్రమే ఆగిపోయిన పూర్ణాకృతి.

జగన్నాథుడే అనంత మహారాణా రూపంలో వచ్చి విగ్రహాలను తీర్చిదిద్దినట్లు, సాక్షాత్తు బ్రహ్మ గారే విగ్రహాల్లో మనలోని ఆత్మవంటి బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఎలా అయితే మనం ఉపాధులు మారుతామో  కాలవశాత్తూ విగ్రహాలను కూడా మార్చి కొత్తవి ప్రతిష్టిస్తారు.  ప్రక్రియను నవ కళేబరా అంటారు.

కిందటిసారి 2015 లో నవ కళేబర కార్యక్రమం జరిగింది. తిరిగి 2034 దాకా ఇవే విగ్రహాలు వుండే అవకాశం వుంది.

ముందుగా పాత విగ్రహాలకు అక్కడ కోయిల వైకుంఠం అనే ప్రదేశంలో అంత్యేష్టి కార్యక్రమం చేస్తారు. భగవంతునికి అంత్యేష్టి ఏమిటి అంటే ఆయన కూడా మనలో ఒకరు అనే భావన. భక్తులు పూజారులు అంతా ఏడుస్తారు. మైలపాటిస్తారు.

ఈలోగా కొత్త విగ్రహాలను తయారు చేసుకుంటారు. ముఖ్య పండాలు కళ్ళకు గంతలు కట్టుకుని కొత్త విగ్రహాల్లోనికి బ్రహ్మ పదార్థాన్ని పెట్టడం ద్వారా ప్రాణ ప్రతిష్ట చేస్తారు.

బ్రహ్మ పదార్థం అంటే జగన్నాధుని లో గోపాల యంత్రం, సుభద్ర లో భువనేశ్వరి యంత్రం, బలదేవునిలో శివ యంత్రంసుదర్శనుడిలో నరసింహ యంత్రంప్రవేశ పెడతారు.

జగన్నాథ స్వామి కూడా సంవత్సరానికి ఒకసారి తన ఉత్సవ విగ్రహమైన మదనమోహనుడి ద్వారా దేవకి వసుదేవులకు, యశోదా నందులకుగుండీచఇంద్రద్యుమ్నులకు, ఆరుగురికి పిండ ప్రదానం చేస్తారు. ఇది ఎంతటి ఆశ్చర్యంగొలిపే విషయం? సాక్షాత్తు భగవంతుడే పితృ కర్మలను చేయటం పెద్దవారిపై ఉండవలసిన గౌరవం మనకి తెలపటానికే కదా!

నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే .

బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః 

ఇంక ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించి గరుడ స్తంభాన్ని స్పృశించి జగన్నాథుని దర్శనానికి వెళ్ళాము. గరుడ స్తంభం కింద శమంతకమణి ఉన్నదనే నమ్మకం. ఎంతో ఉక్కిరి బిక్కిరి చేసే జన సందోహంలో తెల్లని బలభద్రుడు, పసుపుపచ్చని బంగారు ఛాయతో సుభద్ర అమ్మవారు, పక్కన నల్లనయ్య. ఇంకా అటుపక్క సుదర్శనుడు. స్వామి కోసం నేను పడిన ఆరాటానికి తగినట్లుగా సంతృప్తిగా దర్శించలేకపోయానని బాధ. జగన్నాథుడు ఎఱగడా ఏమిటి? మర్నాడు రెండు మూడుసార్లు అత్యద్భుత దర్శనం లభ్యమయింది. హారతి వేళకు దర్శనాలు ఆపినప్పుడు మేము స్వామి ఎదురుగుండా ఉండడంతో దాదాపు 15 నిమిషాల పాటు కళ్ళారా తనివితీరా స్వామిని, అన్నా, చెల్లి, సుదర్శనులతో సహా దర్శించుకున్నాము. ఆయన అనుగ్రహం మాటలతో వర్ణించలేనిది. నల్ల కలువ లాంటి ముఖారవిందంలో విచ్చుకున్న రెండు తెల్ల కలువల లాంటి కళ్ళతో ఆయన మాపై కృపాదృష్టిని ప్రసరిస్తూనే ఉన్నారు. వచ్చారా? సంతృప్తి చెందారా? అని పలకరిస్తూ అనునయిస్తున్న భావనే. పూరి యాత్ర సఫలమైన ఆనందంతో భగవంతుని  సాక్షాత్కారాన్ని హృదిలో పదిలపరచుకున్నానుమూలవిరాట్టులందరికీ నూతన వస్త్రాలను సమర్పించుకున్నాము

గర్భగుడిలోని చైతన్య ప్రభు చేతి గుర్తులను ఇంద్రద్యుమ్నుడి చిత్రపటాన్ని చూడగలిగాము. జగన్నాథని మందిరం లోపల ఉన్న ఉపాలయాలను ముఖ్య ప్రదేశాలను మన హరిత (బెంగళూరు) నగరవాసి శ్రీనండూరి శ్రీనివాస్ గారు ఎంతో పరిశోధన చేసి అందించిన మ్యాప్ చేతిలో పట్టుకుని చూసుకుంటూ టిక్ పెట్టుకుంటూ సాగుతున్నాం. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. మా వైపు ఒక వ్యక్తి వడివడిగా వస్తూ ప్రదేశాలన్నిటి గురించి నండూరి వారికి విశదీకరించింది నేనే అంటూ హిందీలో చెప్పారు. ఎవరా అని చూస్తే వారే గోవింద్ (గోమి) పాండా వారు. అదంతా భగవంతుని కృప అనిపించింది. మేము సంప్రదించకుండా వారే కలవటం కాకతాళీయంగా అనిపించలేదు. మిగతా ప్రదేశాలన్నీ ఆయన స్వయంగా తీసుకుని వెళ్లి చూపించారు. మాలాగా నండూరి వారి మ్యాపులు చూడాల్సిన ప్రదేశాల లిస్టులు పట్టుకుని కొంతమంది గుడి లోపల తిరుగుతున్నారు. ఆధ్యాత్మిక యాత్రలు, తీర్థయాత్రలు, వాటి స్థల పురాణాలను అధ్యయనం చేసిన తర్వాత వెళ్తే పూర్తి సంతృప్తి పొందుతాము. సందర్భంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నిస్వార్ధంగా జిజ్ఞాసులకు ఎంతో సేవ చేస్తున్న శ్రీ నండూరి వారికి శతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాను🙏🙏🙏

ఇంద్రద్యుమ్న మహారాజు మంత్రి విద్యాపతి కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య వంశం వారు ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. రెండవ భార్య వంశం వారు స్వామికి సమర్పించే భోగు తయారు చేయడానికి పాకశాల నిర్వహిస్తారు.   రథయాత్రలో విగ్రహాలను రథాల పై కూర్చోబెట్టేది విద్యాపతి మామగారైన విశ్వావసువు వంశం వారు.  ఇలా స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన వారే తరతరాలుగా అక్కడ విధులను కొనసాగిస్తున్నారు.

పూరి జగన్నాధుని తలుచుకోగానే మహా ప్రసాదం, సర్వం జగన్నాథం అనే నానుడి , నిత్యం గోపురం మీద ధ్వజాన్ని మార్చే విధానం, రథయాత్ర ప్రధానంగా చెప్పుకోవాల్సినవి.

జగన్నాథుని భోగ్

స్వామికి నివేదించే భోగి్ ను పాకశాలలో తయారు చేయడానికి ఎన్నుకోబడ్డ వారు విద్యాపతి మంత్రి వంశంవారు. 600 మంది వంటవాళ్ళు 752 పోయ్యిల మీద తయారు చేసే ప్రసాదాన్ని ముందుగా విమలాదేవికి నివేదిస్తారు. అప్పుడే దాన్ని మహాప్రసాదం అంటారు. భోగ్ పలు విధాల ఉంటుంది. 56 రకాల తో చేసే చపన్ భోగు అన్నిటికంటే ముఖ్యమైనది. అది స్వామి స్వీకరిస్తారు. అలాగే బరడిభోగు, అక్కడే తినగలిగే అన్నం పప్పు కూరలతో కూడిన సంకుడి ప్రసాదం, బంధుమిత్రులకు పంచుకోవడానికి తాటాకు బుట్టల్లో లభ్యమయ్యే సుఖీలా ప్రసాదం . బుట్ట కాజా, లడ్డు వంటి స్వీట్స్ తో కూడినది.  

బోగ్  ను తయారు చేసేవారు ముందుగా కడుపునిండా భోజనం చేసి ముక్కులకు వాసన తెలియకుండా గుడ్డలు కట్టుకుని చేస్తారుట. ఆకలితో చేస్తే పదార్థాలమీదకు మనసు వెళుతుందని విధంగా చేస్తారుట. ఎవరికంటా పడకుండా స్వామి చెంతకు రహస్యంగా టన్నెల్లో చేరవేస్తారుట. అహంకారంతో ప్రసాదం తయారు చేస్తే కుండలు పగిలిపోతాయని పాకశాలలో అపచారం జరిగితే ఎక్కడి నుండో అకస్మాత్తుగా నల్ల కుక్క ఆలయంలోకి ప్రవేశిస్తుందని చెప్తారు. అంత జాగ్రత్త తీసుకుంటారు ప్రసాదం తయారు చేసే విషయంలో. పూరిలో జగన్నాథుడు ఎంత మహిమగలవాడో ఆయన ప్రసాదం కూడా అంతే మహిమాన్వితమైనది. అందుకే గొప్ప పేద బేధం లేకుండా అంతా ఆనంద బజార్లో నేల మీద కూర్చుని తింటూ ఉంటారు. సర్వం జగన్నాథం అన్న నానుడి అందుకే వచ్చింది. ప్రసాదాన్ని, దాని రుచిని విమర్శించటం మహా పాపం. ఒక అర్చక స్వామి వలన జగన్నాధునికి ప్రత్యేకంగా సమర్పించిన 56 రకాల చపన్ భోగులో ఒకటి అయిన, నేతి ఘుమఘుమలతో వేడివేడిగా కొబ్బరి అన్నం లాంటి ప్రసాదం మాకు లభించింది. అంతా జగన్నాధుని దయ.

సంకుడి ప్రసాదాన్ని రెండు రోజులు వరుసగా ఆనంద్ బజార్లో కూర్చుని స్వీకరించాం.

ఆనంద్ బజార్లో మిగిలిపోయిన ప్రసాదాన్ని ఎండబెట్టి గులాబీ బట్టల్లో చిన్న చిన్న మూటలుగా అమ్ముతారు. ఏకాదశి ఉపవాసం మర్నాడు అందులోని కొన్ని గింజలను మన ఆహారంలో కలిపి వండుకుంటే ఎంతో మంచిది.  


                                                                   
                                                                                    నీల చక్రం 

చక్రం దృష్ట్వా హరేర్దూరాత్ ప్రాసాదోపరి సంస్థితం !

సహసా ముచ్యతే పాపా న్నరో భక్త్యా ప్రణమ్యతం. ! 

ధ్వజ మార్పిడి 

217 అడుగుల ఎత్తైన పూరి గోపురం మీదకు ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ఇద్దరు వ్యక్తులు ఆధారం లేకుండా సునాయాసంగా చకచకా ఎక్కి అక్కడ ఉన్న నిన్న వేసిన ధ్వజం లేదా జెండాని తీసి కొత్తది ఎగురవేస్తారు. మెడలు రిక్కించి ఎంతో ఆశ్చర్యంగా అందరూ రోడ్లమీద నుండి చూస్తూనే ఉంటారు. మేమున్న రెండు రోజులూ చూసాము. సాయంత్రం ఐదు గంటలకు నుండి ఒక అనువైన చోటు చూసుకుని ఎదురు చూస్తూ ఉన్నాము. భక్తులు ఎన్నో జెండాలు సమర్పించడం వలన ఆరోజు మాకు కన్నుల పండుగగా ఎన్నో ద్వజాలను అలంకరించి ఎగరవేయుటము చూడగలిగాము.

 

పూరి రథయాత్ర 


ఇంక ఎంతో ఉత్కంఠ కలిగించే పూరి రథయాత్ర విషయానికి వస్తే జ్యేష్ట పూర్ణిమనాడు స్నాన యాత్రతో దీనికి సన్నాహాలు ఆరంభమవుతాయి.  

108 కలశాలతో చల్లని నీటిని శీతలా దేవి దగ్గర ఉండే సోనాకువ బావి నుండి తెచ్చి స్నాన వేదికపై మూల విరాట్టు విగ్రహాలను ఉంచి సంతత ధారగా పోస్తారు. స్నానానంతరం స్వామికి ముందుగా గణపతి వేషం వేస్తారు. చల్లటి నీటితో స్నానం చేయటం వలన జగన్నాధ బలబద్ర సుభద్ర లకు జలుబు చేయటంతో వారికి దుప్పట్లు కప్పి విశ్రాంతిని ఇస్తారు. మందులు వేస్తారు. 10 రోజుల తర్వాత వారికి పథ్యం పెడతారు. స్నానాలతో అంగరాగవిహీనులైన వారందరినీ కొత్త కొత్త  రంగులతో ముచ్చటగా తయారు చేస్తారు. కొత్త శక్తితో స్వామి సరికొత్తగా రథయాత్రకు సిద్ధమవుతారు.

మేనత్త ఇంటికి సెలవులకు వెళ్లడానికి స్వామి నందిఘోష్  అనేరథంపై, బలభద్రుడు తాళద్వజరథం పైన, సుభద్ర దర్పదలన (పద్మధ్వజం) అనే రథంపై సాగుతారు.

16 చక్రాల నంది ఘోష్ రథాన్ని పసుపుపచ్చని ఎర్రటి వస్త్రాలతో అలంకరిస్తారు. శంఖచూడ అనేతాళ్ళతో దారుకుడు అనే సారథి దాన్ని ముందుకు నడిపిస్తాడు.

ఎక్కడైనా ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలు రావటం కద్దు. మూల విరాట్టు లే తమని దర్శించడానికి రాలేని వారికోసం కదలిరావడం కదలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, అన్నట్లు అన్ని మతాల వారిని అనుగ్రహించడానికి ఆయనే తన అన్న చెల్లితో రోడ్డు మీదికి రావటం అనిర్వచనీయం.   

దేశం నలుమూలల నుండి, దేశ విదేశాల నుండి వచ్చిన అన్ని లక్షల మంది ఊరేగింపులో స్వామిని చూడలేకపోయినా స్వామి దృష్టి తమపై పడిన చాలని విశ్వసిస్తారు. ఆయనను తాకిన గాలి తమని స్పృశించటమే అదృష్టం అనుకుంటారు. కులమతాలకు అతీతంగా అందరి నోట అప్పుడు ఒకటే మాట జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంటూ ఆయనను ఆర్తిగా దర్శిస్తారు.

 

                                                                   గుండీచ మందిరం

సంవత్సరంలో తొమ్మిది రోజులు నీ భార్య గర్భంలో కొలువుంటాను అని జగన్నాథుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి వరమిచ్చాడు అదే జగన్నాథ రథయాత్ర.

 అలా మేనత్త గుండీచా ఇంట తొమ్మిది రోజులు మకాం చేస్తారు. ఆ సమయంలో మునులు, గోపికలు అంతా సూక్ష్మ రూపంలో అక్కడ ఉంటారట. అదే బృందావనం అని వారి నమ్మకం.

మూడు రోజులు స్వామి వెనుకకు వస్తారని ఎదురు చూసి రాకపోతే అమ్మవారు గుండీచాకు వెళ్లడం హేరా పంచమి వేడుకగా నాటకీయంగా అర్చక స్వాములు అభినయించటం ఈ సంబరాల మరో ప్రత్యేకత.

స్వామి ఆమెను గుడి లోపలకి రానీయకపోవటం, ఆమె అలగటం తొమ్మిది రోజుల తర్వాత స్వామి తిరిగి పూరి శ్రీ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆమె అలుక తీర్చటం చాలా ముచ్చటగా ఉంటుంది.

జగన్నాథ బలబద్ర సుభద్ర పాత రథచక్రాలను అక్కడ విక్రయిస్తారు. మేము అక్కడ స్టేట్ మ్యూజియంలో ఎన్నో అలంకరణలతో ఉన్న జగన్నాధ బలభద్ర సుభద్రల మూర్తుల చిత్రపటాలను చూసాము. రథయాత్రకు వెళ్ళకపోయినా ఆషాడ శుద్ధ విదియనాడు రథయాత్రని తలుచుకోవటం దర్శించిన అనుభూతిని ఇచ్చింది.  

నీలాద్రినాధం నమామి నిత్యం ! నమామి నిత్యం నీలాద్రినాధం

నౌమి ప్రణోమి నమస్కరోమి ! గృణామి నిత్యం  నీలాద్రినాధం🙏 

                                                                               జై జగన్నాథ్

చన్నా ప్రగడ (గంధం) జయలక్ష్మి

బెంగళూరు.


 


 

Comments

  1. పూరి దివ్య క్షేత్రం గురించి చాలా బాగా వివరించావు. జగన్నాథుని భవ్యమైన, దివ్యమైన విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. మీరు చాలా భక్తిగా స్వామి వారిని సేవించుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. జగత్తుకే నాథుడైన ఆ శ్రీహరి విశేషాలు రథయాత్ర రోజున తెలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. షేర్ చేసిన నీకు చాలా థాంక్స్.

    ReplyDelete
  2. As usual very well written atta 😁 Blessed 🙏 Jai Jagannath 🙏🤩🙏

    ReplyDelete

Post a Comment

Popular Posts